Best Web Hosting Provider In India 2024
Medak : సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో శ్రమదోపిడీ జరుగుతోంది.. బృందాకారత్ కీలక కామెంట్స్
Medak : సంగారెడ్డిలో సీపీఎం మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు సీపీఎం కీలక నేతలు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లౌకికవాద శక్తులతో కలిసి బీజేపీ విధానాలపై పోరాడాలని పిలుపునిస్తున్నారు. అటు శ్రమ దోపిడీపై బృందాకారత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో శ్రమ దోపిడీ జరుగుతోందని.. సీపీఎం ఆగ్ర నాయకురాలు బృందాకారత్ ఆరోపించారు. బీజేపీ మద్దతుతో ఇది జరుగుతోందని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో 12 నుంచి 13 గంటలు పని చేయిస్తున్నారని అన్నారు. దీన్ని ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఇది బాధాకరం..
అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇలాగే జరగడం బాధాకరమన్నారు. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలను సరిగా అమలు చేయాలని బృందాకారత్ సూచించారు. ఇండియా కూటమి ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సరైన దారి చూపాలని పిలుపునిచ్చారు.
కలిసి పోరాడాలి..
సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం తెలంగాణ నాలుగో మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరైన బృందాకారత్.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారుల ఆస్తులు 400 రెట్లు ఆస్తులు పెరిగాయని వ్యాఖ్యానించారు. కార్మికులు, రైతులు కలిసి పోరాటం చేస్తనే న్యాయం జరుగుతుందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు కార్మిక చట్టాలకు విరుద్దంగా ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేపిస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయని విమర్శలు గుప్పించారు.
జీతాలు సరిగా ఇవ్వడం లేదు..
సంగారెడ్డి జిల్లాలోనే నాలుగు వేలకు పైగా పరిశ్రమల్లో.. వేలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారని బృందాకారత్ వివరించారు. వారికీ ఆ పరిశ్రమల యజమానులు కార్మిక చట్టాలకు లోబడి జీతాలు చెల్లించడంలేదని ఆరోపించారు. చాల మంది కార్మికులకు రూ.10,000 నుంచి రూ.12,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాడేది ఎర్ర జెండాలే..
అంగన్వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంలేదన్నారు. నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్నా.. జీతాలు మాత్రం పెంచడం లేదన్నారు. పేదలు, కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలబడి కొట్లాడుతున్నది ఎర్రజెండాలేనని స్పష్టం చేశారు కారత్. ఈ మహాసభ ఖర్చులు మొత్తం.. సంగారెడ్డి జిల్లాలోని కార్మికులు ఇస్తున్నారని.. వారికందరికి అభినందనలు తెలిపారు.
(రిపోర్టింగ్-ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్