Best Web Hosting Provider In India 2024
Etikoppaka Toys : కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఏటికొప్పాక బొమ్మల శకటం
Etikoppaka Toys : దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించాయి. వీటిల్లో ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటాన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఏటికొప్పాక బొమ్మలకు ఘన చరిత్ర ఉంది.
ఢిల్లీల్లోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఏటికొప్పాక బొమ్మలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఈ బొమ్మలు.. గణతంత్ర వేడుకల్లో శకటం రూపంలో దర్శనమివ్వడంపై ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
400 ఏళ్లుగా..
జీఐ ట్యాగ్ సంపాదించిన ఈ బొమ్మలను.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో తయారు చేస్తారు. గత 400 ఏళ్లగా ఇక్కడ వీటిని తయారు చేయడం గమనార్హం. వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో.. ఇక్కడి ప్రజలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సూది మొన పరిమాణం గల బొమ్మలను కూడా ఇక్కడ సులువుగా చెక్కి చూపిస్తారు. ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది.
మోదీ మనసును దోచేశాయి..
ఏటికొప్పాక అందమైన కళాకండాలు ప్రధాని మోదీ మనసును కూడా దోచాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో మాట్లాడిన మోదీ.. పిల్లలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేలా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారని వివరించారు. వీటి అభివృద్ధి కోసం సి.వి.రాజు అనే వ్యక్తి ఓ కొత్త ఉద్యమం చేపట్టి మరింత నైపుణ్యంతో తయారుచేసి పూర్వవైభవం తెచ్చారని కొనియాడారు. ప్రధాని మోదీ వీటి గురించి మాట్లాడటం వల్ల డిమాండ్ పెరిగిందని తయారీదారులు చెబుతున్నారు.
ప్రోత్సాహం ఏదీ..
అయితే.. బొమ్మలకు ప్రాణం పోస్తున్న ఈ కళాకారుల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండటం లేదనే వాదన ఉంది. బొమ్మల తయారీకి వాడే అంకుడు కర్రపై నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని ఎత్తివేసి.. రాయితీపై కర్రని ఇప్పించాలని తయారీదారులు కోరుతున్నారు. తమకు ప్రోత్సాహం అందిస్తే.. ఇంకా అద్భుతాలు చేస్తామని చెబుతున్నారు. తమ కష్టాలు ఎలా ఉన్నా.. ఏటికొప్పాక బొమ్మల శకటం ఢిల్లీ వరకు వెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాపిక్