Best Web Hosting Provider In India 2024
Pawan Kalyan : పదవుల కోసం ఏ రోజు రాజకీయం చేయలేదు, పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Pawan Kalyan : ఏపీలో ఇటీవల జరిగిన పదవుల చర్చలపై జనసేన శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. తాను పదవుల కోసం ఏనాడూ రాజకీయం చేయలేదని తెలిపారు. కూటమి శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.
Pawan Kalyan : ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరుపార్టీల నేతలు, శ్రేణులు మీడియా ముందు, సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ విషయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం అని పవన్ గుర్తుచేశారు.
కూటమి బలం మాత్రమే కాదు..
“ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, చట్ట సభల్లో వైసీపీ జుగుప్పాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కూటమిపై నమ్మకం ఉంచారు. అనుభవం కలిగిన పాలన, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164/175 స్థానాలను ఎన్డీఏ కూటమికి, 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు” – పవన్ కల్యాణ్
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని
“ఈ విజయాన్ని ప్రజలు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో సీఎం నారా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం”
ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దని కోరారు.
పదవుల కోసం రాజకీయం చేయలేదు
ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ కలిపి నడవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా చేయనన్నారు.
తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే అని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ సందేశం ఇచ్చారు.
టాపిక్