Best Web Hosting Provider In India 2024
Janagama News: జనగామ జిల్లాలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్.. మంత్రి పొంగులేటి సభ రద్దు
Janagama News: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంటిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఏర్పాటు చేసిన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి పొంగులేటి సభకు హాజరు కావాల్సి ఉండగా, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట లాఠీఛార్జీకి దారి తీసింది.
Janagama News: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఘర్షణతో జనగామలో మంత్రి పొంగులేటి హాజరు కావాల్సిన సభ రద్దయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉంది.
మంత్రి పర్యటన సందర్భంగా జనగామ జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ముందుగా హనుమకొండ జిల్లాలోని పెంబర్తి, క్యాతంపల్లిలో సభలు ముగించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎర్రగుంట తండాకు బయలు దేరారు.
అదే సమయంలో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను విడిచి పెట్టాలంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి సభ వేదిక వద్దకు వచ్చారు. అక్కడున్న వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ తో మాట్లాడి తమ కార్యకర్తలను విడిచి పెట్టాలని కోరారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పల్లాకు జై అంటూ నినాదాలు చేశారు.
దీంతో కాంగ్రెస్ నేతలు పల్లాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తరువాత ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసుకోగా.. ఒక్కసారిగా సభా ప్రాంగణం కాస్త రణరంగంగా మారింది.
ఇరువర్గాలపై పోలీసుల లాఠీ ఛార్జ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట పెరిగి పోవడం, పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు మొదట ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడం, అక్కడంతా గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగే అవకాశం కనిపిస్తుండటంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్ లో కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ కార్యకర్తకు లాఠీ దెబ్బలకి రక్త స్రావం జరిగింది. అక్కడి పరిస్థితి సద్దుమనిగేలా కనిపించకపోవడంతో పోలీసులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని జనగామ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఎర్రగుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభకు హాజరు కావాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితుల వల్ల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లాఠీ ఛార్జ్ పై విచారణ జరపాలి
బీఆర్ఎస్ నేతలపై జరిపిన లాఠీ ఛార్జ్ పై విచారణ జరపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీ చార్జి అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము సంయమనంగా ఉన్నా పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఆరోపించారు. 16 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నలుగురు మీడియా పర్సన్స్ గాయపడ్డారని తెలిపారు.
లాఠీచార్జీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ను కోరారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఓర్వలేక ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఎర్రకుంట తండాలో పంచాయితీ పెట్టేందుకు వచ్చారని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విమర్శించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్