Best Web Hosting Provider In India 2024
Meerpet Murder: సినిమా ప్రేరణతో శవాన్ని మాయం చేశాడు.. వీడిన మీర్‌పేట మర్డర్ మిస్టరీ? సాంకేతిక ఆధారాలపై పోలీసుల ఫోకస్
Meerpet Murder: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించి ఆనవాళ్లు చిక్కకుండా ఫ్లష్ చేసినట్టు గుర్తించారు.
Meerpet Murder: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో జరిగిన హత్యను కప్పి పుచ్చేందుకు నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాతో ప్రేరణ పొందినట్టు దర్యాప్తులో వెల్లడించాడు. శవాన్ని మాయం చేసే నేపథ్యంలో ఇటీవల ఓటీటీలో విడుదలైన సూక్ష్మదర్శిని సినిమాతో ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది.
హైదరబాద్ మీర్ పేట హత్య కేసులో రోజుకో కొత్త సంగతి బయటపడుతోంది. కుక్కర్ ఉడికించి భార్య శవాన్ని మాయం చేసినట్టు పోలీసులకు చెప్పిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించినట్టు గుట్టు విప్పాడు. శవం మొత్తాన్ని కుక్కర్‌లో ఉడికించడం ఎలా సాధ్యమనే సందేహాలు వచ్చినా అసలు రహస్య విచారణలో వెలుగు చూసింది.
ఈ కేసుపై పోలీసులు విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి. నిందితుడు గురుమూర్తి భార్య వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత విషయం బయటపడితే ఆమె కుటుంబ సభ్యుల నుంచి హాని కలుగుతుందని భావించాడు. గతంలో కుటుంబ వివాదాల నేపథ్యంలో మాధవి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేయడంతో హత్య విషయం వెలుగు చూస్తే తనకు అపాయం కలుగుతుందని భావించాడు.
దీంతో ఆమె శవాన్ని మాయం చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన సూక్ష్మదర్శిని అనే మలయాళ డబ్బింగ్ సినిమాలో శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లు, రసాయినాలను వినియోగించడం గుర్తుకు రావడంతో ఆ టెక్నిక్స్ ఉపయోగించినట్టు పోలీసులకు వివరించాడు. నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పి పోలీసులు ముప్ప తిప్పలు పెట్టడంతో కేసు విచారణలో గందరగోళానికి గురయ్యారు.
సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వారి మాట వినకుండా పెళ్లి చేసుకుని బాలికను దత్తత తీసుకున్న కూతురిని.. ఆమె తల్లి కొడుకుతో కలిసి హత్య చేస్తుంది. శవాన్ని మాయం చేయడానికి ఇంట్లో చిన్న నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసి, అందులో యాసిడ్, రసాయనాలు కలిపి శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్, రసాయనాలు శవాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తాయి. ఆ నీటిని వాష్ రూమ్ ద్వారా ఫ్లష్ చేసేస్తారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా… తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారు.
మీర్‌పేటలో వెంకట మాధవి హత్య కేసులో కూడా నిందితుడు ఆమె శవాన్ని అలాగే మాయం చేసి నేరం నుంచి తప్పించుకోవాలని భావించాడు. రంపం బ్లేడుతో తల, మొండెం వేరు చేసి, శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి, మాంసాన్ని బకెట్‌లో వేసి హీటర్‌తో ఉడికించాడు. ఆ తర్వాత ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత వాటిని పేస్ట్ తరహాలో మార్చేశాడు.
ఎముకలను ఇంట్లోనే స్టవ్‌పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి దంచి పొడిలా మార్చేశాడు. ఇదంతా నిందితుడు ఒక్కడే ఇంట్లోనే చేశాడు. వీటిని కొంత బాత్‌రూమ్‌లో ఫ్లష్ ద్వారా, మరికొంత బకెట్‌లో వేసుకొని మీర్‌పేట పెద్ద చెరువులో పారేశాడు.హత్యకు ఆధారాలు దొరక్కుండా ఇంటిని రసాయినాలతో శుభ్రం చేశాడు.
శవాన్ని మాయం చేసే క్రమంలో ఎముకల్ని కాలుస్తున్న సమయంలో నిందితుడు గురుమూర్తి చేతులు పలు చోట్ల కాలాయి. శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను పోలీసులకు వివరించాడు. ఇంట్లోంచి దుర్వాసన బయటకు రాకుండా రసాయనాలు, స్ప్రేలను వినియోగించాడు. నిందితుడు యాసిడ్లను కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. గదిలో రక్తపు ఆనవాళ్లు లేకుండా మాయం చేసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేలపై రక్తపు మరకల్ని గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో రక్తపుమరకల్ని శాశ్వతంగా మాయం చేసే అవకాశం లేకపోవడంతో ఘటనా స్థలంలో ఆధారాలను గుర్తించారు. డిఎన్‌ఏ నమూనాలు హతురాలు వెంకటమాధవికి చెందినవేనని నిర్ధారించారు.
టాపిక్