Best Web Hosting Provider In India 2024
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం… వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…ప్రియుడితో కలిసి భర్త హత్య
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అయితే మద్యంతాగొచ్చి చనిపోయాడనే ఆమె అందరికి ప్రచారం చేసి నమ్మించినా ఫలితం లేకుండా పోయింది.
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే, ఆమె ఆ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం కీళ్లపూడి పంచాయతీ గజసింగరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజసింగరాజపురం గ్రామంలో ఆంటోని (34), సుగంధి (30) దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుగంధికి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని ఇరుగువాయికి చెందిన అరుల్ రాజ్ (35)తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్త ఆంటోనికి తెలిసింది. దీంతో భార్య సుగంధిని భర్త పలుమార్లు మందలించాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగున్నాయి. ఇంట్లో జరుగుతున్న గొడవుల గురించి ప్రియుడు అనిల్ రాజ్‌కు సుగంధి చెప్పేది. దీంతో ప్రియుడు, ప్రియురాలు కలిసి తమకు అడ్డుగా ఉన్న ఆంటోనిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త అడ్డును తొలగించుకుంటే, తమ వివాహేతర సంబంధానికి ఇంకా ఎవరు అడ్డు ఉందని భావించారు. దీంతో కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చేందుకు భార్య ప్రణాళిక వేసింది.
శుక్రవారం రాత్రి నిద్ర పోతున్న భర్తను ప్రియుడి ఆంటోనితో కలిసి భార్య గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. ఆ తరువాత అరుల్‌రాజ్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. సుగంధి మాత్రం ఏమీ తెలియనట్టు ఇంట్లోనే ఉండిపోయింది. శనివారం ఉదయం బయటకు వచ్చి బిగ్గరగా కేకలు వేస్తూ తన భర్త మద్యం తాగొచ్చి చనిపోయాడంటూ ఏడుస్తూ నటించింది. తొలిత అందరూ నిజమేకాబోలు అని నమ్మారు. దీంతో మద్యం తాగే ఆంటోని చనిపోయాడని ప్రచారం జరిగింది. ఇది సాధారణ మరణమే అనుకున్నారు. అయితే కుటుంబ సభ్యులకు మాత్రం సుగంధి తీరుపై అనుమానం వచ్చింది.
అయితే ఆమెను కుటుంబ సభ్యులు, బంధువులు ఎలా జరిగిందని ఆరా తీశారు. దీంతో ఆమె చెప్పిన సమాధానాలకు పొంతనలేకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య సుగంధిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిజం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు అంగీకరించింది. ఈ క్రమంలో సుగంధితోపాటు అనిల్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరిని ఆదివారం పోలీసులు విచారించారు.
ఎస్ఐ వెంకటేష్ స్పందిస్తూ నిందితులిద్దరిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తమ ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలిందని అన్నారు. క్షణికావేశంతో తీసుకున్న ఈ నిర్ణయంతో పిల్లలు రోడ్డున పడ్డారని స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. పిల్లలు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్