Best Web Hosting Provider In India 2024
AP Andariki Illu : అందరికీ ఇళ్ల పథకంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ-రెండేళ్లలో నిర్మాణం, పదేళ్ల తర్వాత హక్కులు
AP Andariki Illu Scheme : ఏపీ ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంపై జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం మహిళల పేరిట అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభించనున్నాయి.
AP Andariki Illu Scheme : పేదలందరికీ ఇళ్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని ఇటీవల కేబినెట్ సమావేశం నిర్ణయించారు. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు మహిళల పేరుతో ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది.
ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం
ఏజెన్సీల ద్వారా పేదల ఇళ్లు నిర్మించనున్నారు. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు లబ్దిదారులకు అవకాశం ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనున్నారు.
ఉచిత ఇంటి స్థలం మార్గదర్శకాలు
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత ఇంటి స్థలాలపై సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నారు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు. లబ్ధిదారులకు రాష్ట్రంలో మరెక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారులుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారధి ఇటీవల స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 1.14 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇళ్లు అందించనున్నారని తెలియజేశారు.
పీఎంఏవై పథకం కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గృహనిర్మాణానికి 6 నెలలలో రూ.502 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
2026 నాటికి 7 లక్షల ఇళ్లు
“అర్హత కలిగిన ప్రతి పేదవానికి సొంత ఇల్లు నిర్మించి ఇస్తాం. PMAY-1 కింద మార్చి 2026 నాటికి 7 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా గృహనిర్మాణ శాఖ పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం 1లక్ష 14 వేల ఇళ్లను నిర్మించాం. వారందరికీ సీఎం చంద్రబాబు చేతులు మీదుగా ఫిబ్రవరి 1 న తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది” -మంత్రి పార్థసారథి
టాపిక్