Best Web Hosting Provider In India 2024
Republic Day : దేశమంతా 76వ రిపబ్లిక్ డే వేడుకలు.. కానీ అక్కడ మాత్రం కాదు.. ఎందుకో తెలుసా?
Republic Day : దేశంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని హస్తినా నుంచి గ్రామస్థాయి వరకు గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులు జరుపుకున్నారు. దేశమంతా 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటే.. ఓ ప్రాంతం మాత్రం 71వ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు గోదావరి జిల్లాకు సమీపంలో ఉన్న యానాంలో.. ప్రజలు 71వ గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. ఇదో ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో పోరాటాలతో 1947లో దేశానికి స్వతంత్రం వస్తే.. ఫ్రెంచ్ ప్రభుత్వం పాలనలో ఉన్న యానాంకు 1954 నవంబర్ 1న స్వాతంత్రం వచ్చింది. అప్పటి ఫ్రెంచ్ కమిషనర్ ఎస్కరుయిల్.. ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలైన యానాంతో పాటు పుదుచ్చేరి, కారైకాల్, మాహేలకు తగిన ప్రాధాన్యం, రక్షణ కల్పించాలని కోరారు.
అప్పటి ప్రధానితో ఒప్పందం..
అప్పటి దేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో ఒడంబడిక కుదుర్చుకుని.. దేశం నుంచి వెళ్లిపోయారు. 1956లో ఈ తాత్కాలిక ఒప్పందం జరిగింది. తరువాత యానాంను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. యానాంలో అందరూ తెలుగులో మాట్లాడినప్పటికీ, ఏపీ ప్రభుత్వం పాలించటం లేదు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అంతర్భగంగా ఉంది. తెలుగు మాట్లాడే ప్రజలు పుదుచ్చేరి పాలనలో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా తెలుగువారే. కానీ ఆయన పుదుచ్చేరి అసెంబ్లీకి వెళ్తారు. యానాం రాజధాని సుదూర ప్రాంతంలో ఉన్న పుదుచ్చేరి.
రెండు జిల్లాల మధ్యలో..
యానాం ఉమ్మడి తూర్పుగోదావరిలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే.. జిల్లాల విభజనతో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్యలో యానాం ఉంది. యానాంలో అన్ని కార్యకలాపాలు పుదుచ్చేరి నుంచే జరుగుతాయి. కాకపోతే ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల్లోనే ప్రజల జీవన విధానం ఉంటుంది. యానాంను ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు. ఎందుకంటే 1929లో శారదా చట్టం ద్వారా.. బాల్య వివాహాలు దేశంలో నిషేధం విధించినప్పటికీ.. యానాం ప్రాంతంలో బాల్య వివాహాలు జరిగేవి.
ప్రకృతి ఒడిలో..
యానాం గోదావరి నది, కోరింగ నదితో కలిసే చోట ఉంటుంది. అతి సుందరగా ప్రకృతి వడిలో సేద తీరినట్లు యానాం ఉంటుంది. చట్టూ నీరు, చెట్లు, పంట పొలాలు ఎటు చూసి పచ్చదనంతో నిండి ఉండే యానాంలో.. వస్తువుల ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పన్ను రాయితీ ఉంటుంది. మద్యం గురించి అయితే ఇంక చెప్పనవసరం లేదు. చాలా తక్కువ ధరకు మద్యం దొరుకుతోంది. రాష్ట్రంతో పోలిస్తే.. ఇతర వస్తువుల ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇక్కడి ప్రజలు స్థానిక పండగలు, వేడుకలు నిర్వహిస్తారు. ఇలా యానాంకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్