Best Web Hosting Provider In India 2024
Ullipaya Pulusu: స్పైసీగా ఉల్లిపాయ పులుసును ఇలా చేసేయండి, అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది
Ullipaya Pulusu: కూరలు తినాలనిపించకపోతే ఉల్లిపాయ పులుసును ఇలా చేసుకుంటే స్పైసీగా ఉంటుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ ఉల్లిపాయ పులుసును కలుపుకొని అన్నం తిని చూడండి అదిరిపోతుంది. రెసిపీ ఇదిగో.
కొన్నిసార్లు ఏ కూరా తినాలనిపించదు. నోరు చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు స్పైసీగా ఉల్లిపాయ పులుసును వండుకుంటే రుచి అదిరిపోతుంది. దీన్ని అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ పులుసుతో ఇడ్లీలు కూడా తినవచ్చు. ఉల్లిపాయ పులుసు రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి. ఎవరికైనా ఇది కచ్చితంగా నచ్చేస్తుంది. పైగా వండడం చాలా సులువు.
ఉల్లిపాయ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు – మూడు
నూనె – రెండు స్పూన్లు
మినప్పప్పు – ఒక స్పూను
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఆవాలు – అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
మెంతులు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను
కరివేపాకులు – గుప్పెడు
కారము – ఒక స్పూను
ధనియాల పొడి – అర స్పూను
చింతపండు – నిమ్మకాయ సైజులో
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
ఉల్లిపాయ పులుసు రెసిపీ
1. ఉల్లిపాయ పులుసును తయారు చేసేందుకు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. అందులో మినప్పప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
4. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి.
5. ఇవన్నీ వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. అవి బాగా వేగాక పసుపు, కారం, కరివేపాకులు వేసి వేయించాలి.
7. ముందుగానే చింతపండు నీటిలో నానబెట్టి ఆ గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు ఈ మిశ్రమంలో ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
9. ఇది ఇగురు లాగా దగ్గరగా అవుతుంది. ఆ సమయంలో ఒక గ్లాసు నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
10. ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. తర్వాత తీస్తే ఉల్లిపాయ పులుసు రెడీగా ఉంటుంది.
11. ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా వేసుకోండి. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి.
12. అంతే సింపుల్ గా ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోతుంది.
13. దీని రుచి అదిరిపోతుంది ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయ పులుసుతో చేసిన అన్నాన్ని తింటే రుచిగా ఉండడం ఖాయం.
మిగతా కూరగాయల్లాగే ఉల్లిపాయల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయల కూర తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఉల్లిపాయ పులుసును ఇడ్లీ దోశల్లో కూడా తినవచ్చు. ఒక్కసారి చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ లోను లంచ్ లో కూడా తినడానికి సరిపోతుంది. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అలాగే ఉల్లిపాయలు, సల్ఫర్, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం కూడా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది. ఉల్లిపాయల్లో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఉల్లిపాయలు తినడం వల్ల నిద్ర సమస్యలు కూడా తగ్గిపోతాయి.
సంబంధిత కథనం