




Best Web Hosting Provider In India 2024

Poornam burelu: పూర్ణం బూరెల నుండి పూర్ణం బయటికి రాకుండా పర్‌ఫెక్ట్‌గా వండడం తెలుసుకోండి, రెసిపీ ఇదిగో
Poornam burelu: పూర్ణం బూరెలు అంటే అందరికీ ఇష్టమే. కానీ చాలామందికి పూర్ణం బయటికి వచ్చి విచ్చిపోయినట్టు అవుతాయి. పూర్ణం బూరెలను పర్ఫెక్ట్ గా ఎలా వండాలో తెలుసుకోండి.
తెలుగిళ్లల్లో పండగ వచ్చిందంటే పూర్ణం బూరెలు ఉండాల్సిందే. వీటి పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ వీటిని వండడం అందరికీ రాదు. కొంతమందికి నూనెలో వేయిస్తున్నప్పుడే పూర్ణం బయటికి వచ్చి విచ్చిపోయినట్టు అవుతుంది. అందుకే పూర్ణం బూరెలు పర్‌ఫెక్ట్‌గా రావాలంటే పూర్ణం బయటికి రాకుండా ఉండాలంటే చిట్కాలు తెలుసుకోండి. ఇక్కడ మేము పూర్ణం బూరెల రెసిపి ఇచ్చాము. మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండితే మీకు బూరే నుండి పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా, టేస్టీగా పూర్ణం బూరెలు వస్తాయి. పర్ఫెక్ట్ గా సరైన కొలతలతో పూర్ణం బూరెలు వండితే అవి చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి.

పూర్ణం బూరెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మినప్పప్పు – ఒక కప్పు
బియ్యం -ఒకటింపావు కప్పు
పచ్చిశనగపప్పు – ఒక కప్పు
బెల్లం – ఒక కప్పు
యాలకుల పొడి – అర స్పూను
ఉప్పు – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
వంటసోడా – పావు స్పూను
పూర్ణం బూరెలు రెసిపీ
1. పూర్ణం బూరెలు ఉండేందుకు పైన మేము చెప్పిన కొలతల్లోనే అన్నింటినీ తీసుకోండి.
2. బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టండి.
3. నాలుగు నుంచి ఆరు గంటలు అవి నానాక రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలో వేసుకొని బాగా కలపండి.
4. అర స్పూను ఉప్పును వేయండి. అవి మరి జారేలా కాకుండా, అలా అని గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఆ పిండి ఉండేలా చూసుకోండి.
5.దీన్ని రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి.
6. ఇప్పుడు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి.
6. ఆ తర్వాత మూత తీసి నీటిని వడకట్టండి.
7. శనగపప్పును తిరిగి అదే కుక్కర్లో వేసి మెత్తగా గరిటతోనే నలుపుకోండి.
8. ఇప్పుడు అందులోనే బెల్లం ముక్కలను కూడా వేయండి.
9. స్టవ్ మీద ఆ కుక్కర్ ని పెట్టి మళ్ళీ మరిగించండి.
10. అందులోనే యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.
11. ఈ మిశ్రమం గట్టిగా ముద్దలాగా అయ్యేవరకు ఉంచండి.
12. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఈ ముద్దను లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టండి.
12. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
13. నూనె వేడెక్కాక శనగపప్పు లడ్డును తీసి ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయండి.
14. అన్ని వైపులా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
15. ఇలా చేస్తే బూరెలు నూనెలోనే విచ్చిపోవడం వంటివి జరగవు.
16. బూరెలు నూనెలో విచ్చిపోతున్నాయి అంటే మీరు పిండి సరిగ్గా తయారు చేయలేదని అర్థం.
17. అంటే బియ్యము మినప్పప్పు కలిపిన మిశ్రమం పర్ఫెక్ట్ గా తగినంత కొలతలతో లేదని అర్థం చేసుకోవాలి.
18. ఇక్కడ మేము చెప్పిన పద్ధతుల్లో మరి మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఆ పిండిని కలుపుకుంటే మీకు బూరె విచ్చిపోకుండా చక్కగా వస్తుంది.
19. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ పూర్ణం బూరెలు మీకు ఎంతో నచ్చుతాయి.
పూర్ణం బూరెల చరిత్ర ఈనాటిది కాదు. తెలుగిళ్లలో గత వందల ఏళ్ల క్రితం నుంచి కూడా పూర్ణం బూరెలను వండుతున్నారని చెప్పుకుంటారు. మహాభారతంలో కూడా బూరెలు, గారెల ప్రస్తావన ఉంటుంది. అందుకే సంక్రాంతి దసరా దీపావళి ఇలా ఏ పండగ వచ్చినా ఇంట్లో బూరెలు రెసిపీ ఉండాల్సిందే. ఎంత తిన్నా కూడా ఈ బూరెలు బోర్ కొట్టవు. బూరెలు రెండు ముక్కలుగా కోసి పైన వేడి వేడి నెయ్యిని వేసి తింటే ఆ రుచే వేరు. బూరెలు, బొబ్బట్లు అనేవి తెలుగింటికి అచ్చొచ్చిన సంప్రదాయమైన స్వీట్లు.