చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాపై భూకబ్జా ఆరోపణలు

Best Web Hosting Provider In India 2024

అటవీభూమి కబ్జా అంటూ ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాపై బుదరచల్లడమే లక్ష్యం

ఒక్క ఎకరా అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా?

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

75 ఎకరాల ప్రైవేటు భూమిని 2001లో కొనుగోలు చేశాం

ఇది అటవీభూమి కాదని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్ మెంట్స్ నిర్ధారించింది

కేంద్ర అటవీశాఖ అనుమతితోనే తారు రోడ్డు నిర్మాణం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాపై కక్షసాధింపులు

మదనపల్లి ఫైల్స్ దగ్ధం అంటూ మాపై నిందలు మోపారు

9 నెలలు అయినా దీనిలో ఒక్క ఆధారం చూపలేకపోయారు

రూ.40 వేల కోట్ల ఇసుక దందా అంటో తప్పుడు ఆరోపణలు చేశారు

నేపాల్ కు ఎర్రచందనం అంటూ అర్థంలేని విమర్శలు చేశారు

ఒక్క దానిని కూడా నిరూపించలేకపోయారు

పచ్చమీడియా అండతో నిత్యం బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు

ఈనాడు, ఈటీవీపై పరువునష్టం దావా వేస్తున్నాం

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి 

తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం తమపై బుదరచల్లే కార్యక్రమం చేస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పులిచర్ల మండలంలో అటవీభూములను కబ్జా చేశామంటూ చంద్రబాబుకు అంటకాగే ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని ఖండించారు. ఇటువంటి తప్పడు కథనం ప్రచురించిన ఈనాడు సంస్థలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ఒక్క ఎకరం అయినా చట్ట విరుద్దంగా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ చేశారు. చట్టబద్దంగా 2001లో కొనుగోలు చేసిన భూములపై నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలతో కూడిన కథనంను ప్రచురించడం వెనుక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు.  
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్ సీపీ నేతలపై కక్షసాధింపులు ప్రారంభించారు. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో మాపై పలుసార్లు తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వ హననంకు ప్రయత్నించారు. నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ, పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు పత్రిక, ఈటీవీల ద్వారా పలుసార్లు మాపై పచ్చి అబద్దాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో సదరు ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువునష్టం దావా కూడా వేయడం జరిగింది. తాజాగా పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీభూమిని భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారురోడ్డు నిర్మించామంటూ ఇష్టం వచ్చినట్లు అబద్దాలు, అభూతకల్పనలతో కూడిన కథనాలను ప్రచురించారు. ప్రారంభంలో 23 ఎకరాలతో భూమిని కొని దానిని 75 ఎకరాలకు పెంచామంటూ అర్థంలేకుండా ఎల్లో మీడియా తన కథనంలో అసత్య ఆరోపణలు చేసింది. 

1981లోనే ఇవి ప్రైవేటు భూములని నిర్ధారించారు

కుట్రలు, కుతంత్రాలకు పెట్టిన పేరు చంద్రబాబు. తాను ఎవరినైతే అప్రతిష్టపాలు చేయాలని భావిస్తారో వారిపై తనకు బాకా ఊదే ఎల్లో మీడియా ద్వారా తప్పుడు వార్తలు రాయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే తరహాలో తాజాగా పులిచర్లలో అటవీభూముల కబ్జా అంటూ అవాస్తవాలతో కూడిన వార్తను అచ్చేశారు. ఈనాడు పత్రిక ఆరోపించిన భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవని 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్ మెంట్స్ ఆఫీసర్ గా ఉన్న ఐఎఎస్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆర్డర్ పొందిన వ్యక్తుల నుంచి 2001లో మేం ఈ భూములను కొనుగోలు చేశాం. అలాగే ఈ ప్రాంతంలో మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. ఈ పనుల కోసం నియమించిన వారికి నివాస వసతి కల్పించాం. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ అధునాతన భవనాలు, పెద్ద ఎత్తున నిర్మాణాలు అంటూ ఇష్టం వచ్చినట్లు ఈనాడు పత్రిక అబద్దాలపైన అబద్దాలను వండీవార్చింది. అంతేకాదు ఈ ప్రాంతలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ భూములకు కేవలం ఎడ్లబండి వెళ్ళేందుకు మాత్రమే ఆరోజుల్లో రోడ్డు ఉంది. తమకు తారు రోడ్డు కావాలని, అందుకు అనుమతులు ఇవ్వాలంటూ రైతులు అటవీశాఖ పీసీసీఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును కేంద్ర అటవీశాఖకు పంపి, అక్కడి నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే తారురోడ్డు నిర్మాణంకు పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. అటవీచట్టాల పట్ల మాకు గౌరవం ఉంది. చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఈనాడు పత్రికకు ఈ వాస్తవాలు కనిపించవు. 

రెండుసార్లు జరిపిన విచారణలోనూ ప్రైవేటు భూములేనని నిర్ధారించారు

ఇదే భూములపై కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి అనే నాయకుడు ఫిర్యాదు చేశాడు. దానిపై ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి ఇది అటవీభూమి కాదు, ప్రైవేటు భూమి అని నిర్ధారించారు. తిరిగి అదే వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాడు. తిరిగి మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు ఈ భూమి ప్రైవేటు భూమి అని నిర్ధారించారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్ లో కూడా కేసు వేశాడు. అక్కడ కూడా ఈకేసును డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజిట్ లో 1968లోనే ఇది ప్రైవేటు భూమి అని చూపించారు.  

ఈనాడుపై రూ.50 లక్షలకు నష్టపరిహారం కేసు వేశాం

గతంలోనే పచ్చపత్రికలు మా వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ పలుసార్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై చిత్తూరు కోర్ట్ లో ఈనాడు, ఈటీవీలపై కూడా రూ.50 లక్షలకు నష్టపరిహారం కేసు వేశాం. ఇప్పుడు ప్రచురించిన ఈ కథనంపైన కూడా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబుకు కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీల్లో మాపై ప్రచురించిన తప్పుడు కథనంపై కనీసం వాస్తవాలను తెలుసుకోకుండానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదో జరిగిపోయిందంటూ, దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. గతంలో ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ ఇసుకలో రూ.40వేల కోట్లు దందా చేశామంటూ మాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పటి వరకు మేం చేసిన దందాను ఎందుకు బయటపెట్టలేక పోయారు? ఇసుకకు సంబంధించిన ఫైల్స్ అన్నీ వెరిఫై చేయిస్తున్నారు, అందులో మేం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు గుర్తించారా? కేవలం అభూతకల్పనలు, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేయడానికే మీరు పరిమితమయ్యారని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇదే పెద్ద మనిషి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశామని, నేపాల్ లో అది పట్టుబడిందని కూడా పనికిమాలిన ఆరోపణలు చేశారు. అటవీశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేపాల్ కు వెళ్లి పట్టుబడిన ఎర్రచందనంపై మాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

ఆనాడు మదనపల్లి ఫైల్స్ దగ్ధం అంటూ హంగామా చేశారు

రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నిస్తోంది. ముందుగా మదనపల్లిలో రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంను మాపై నెట్టేందుకు ప్రయత్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు స్పందించడం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో డీజీపీని, సీసీఎల్ఎ, రెవెన్యూ అధికారులను పంపించడం ఏదో జరిగిపోతోందనే రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డారు. ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతోంది. మదనపల్లి ఘటనలో ఎవరిమీద చర్యలు తీసుకున్నారు? మా ప్రమేయం ఉందని, మేం ఎక్కడైనా తప్పుచేశామని గుర్తించారా?  కేవలం వైయస్ఆర్ సీపీపై ఆరోపణలు చేయాలి, మాపై విషప్రచారం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ప్రజలకు చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా అనేక అబద్దాలు చెప్పారు. అమలు చేయలేని వాగ్ధానాలు చేసి, హామీలు ఇచ్చి ఈ రోజు వాటిని నేను అమలు చేయలేనంటూ నిస్సిగ్గుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఘనుడు చంద్రబాబు. తన అసమర్థత, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాపై డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎల్లో మీడియాను ఉపయోగించుకుని బురదచల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ పచ్చపత్రికలు, ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారు. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…

వైయస్ఆర్ సీపీ పార్టీ ఇద్దరితో ప్రారంభమైంది. ఎంత మంది పోయినా, వచ్చినా తిరిగి వైయస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటాం. ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇస్తున్న పెన్షన్లలో కూడా ఇప్పటి వరకు మూడు లక్షల పెన్షన్లు తొలగించారు. చంద్రబాబు అబద్దాలను ప్రజలు నమ్మరు అని మేం భావించాం. కానీ తప్పుడు హామీలు, ఆకర్షనీయమైన వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. తీరా వాటిని అమలు చేయలేనంటూ ఈ రోజు చేతులెత్తేయడం ఆయన నైజంకు నిదర్శనం. వైయస్ జగన్ గారు ఎన్నికల సందర్భంగా చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా ఒక క్యాలెండర్ ప్రకారం ప్రజలకు అందించారు. చంద్రబాబులా మాట తప్పలేదు. కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.

Best Web Hosting Provider In India 2024