Best Web Hosting Provider In India 2024
Stress: ఒత్తిడిని ఇలా వదిలేయండి, జీవితమంతా సంతోషంగా ఆరోగ్యంగా బతకండి
ఒత్తిడి పెద్ద భూతం. అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పీల్చి పిప్చి చేస్తుంది. ఒత్తిడి వల్ల కలిగే చెడు ప్రభావాలు ఏమిటో తెలుసుకోండి. అలాగే దాన్ని వదిలించుకోవడం ఎలాగో కూడా నేర్చుకోండి.
ఆధునిక మానవుడి అతిపెద్ద శత్రువు ఒత్తిడే. ఈ ఉక్కిరి బిక్కిరి ప్రపంచం మనషిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తోంది. చిన్నపాటి ఒత్తిడే కదా అని వదిలేస్తే అది మనిషినే కబళిస్తుంది. జీవితాన్ని హరిస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి వల్ల ఎన్నో కొత్త రోగాలు, సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒత్తిడి కలగడానికి కారణం మన జీవన శైలే. ఉదయం లేస్తూనే ఉరుకులు పరుగులు. గబగబా రెండు ముద్దలు తినేసి పనులకు పరుగులు పెడతారు. ఆఫీసు పనులు, ఆర్ధిక ఒతిళ్లు, పిల్లలు, స్కూల్లు అన్నీ కలిపి మనిషిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా కుంగదీస్తున్న అతి పెద్ద సమస్యగా ఒత్తిడి మారిపోయింది.
ఒత్తిడి ప్రభావం ఎంతో
ఒత్తిడికి లోనవటం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు మనల్ని దాడి చేస్తున్నాయి. కార్టిసాల్, అడ్రినలిన్ వల్ల ఒత్తిడి ప్రభావం మన నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి చెట్టంత మనిషిని కూడా కుదేలు చేస్తుంది. పొట్ట నిండా తినలేరు, కంటి నిండా నిద్రించలేరు. మంచి ఉద్యోగం, హోదా సంపాదన, మంచి ఫ్యామిలీ ఎన్ని ఉన్నా ఏదో ఒక బెంగా మనల్ని తినేస్తుంది.
శరీరం, మనసు రెండూ…
నిజానికి ఉన్నదానితో తృప్తి పడలేక పోవడమే ఒత్తిడికి కారణం. పని ఉన్నా కూడా ఒత్తిడికి గురవుతాం, పని లేకపోయినా గురవుతాం. ఒత్తిడి వల్ల కలిగే మొదటి అనారోగ్యం జీర్ణవ్యవస్థ దెబ్బ తినటం. రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మధుమేహానికి దారితీస్తుంది. మొత్తానికి శరీరం, మనసు పైన ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగడమే ఒత్తిడి నియంత్రణ. ఒత్తిడిని అనుభవించేది, ఆలోచనలోకి తెచ్చుకునేది మన బ్రెయిన్.
ఒత్తిడి వల్ల గ్లూకో కార్తికాయిడ్స్ అనే హార్మోన్స్ ఉత్పన్నమవుతాయి. ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ రిలీజ్ చేస్తుంది. ఒత్తిడి వల్ల గ్లూకోజ్ షుగర్ ని పెంచుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి ప్రభావం గుండెపై పడితే హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఒత్తిడి క్షణికమే కానీ సునామీలా పరిణమిస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, తలనొప్పి, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ హేమరేజ్ వచ్చేస్తాయి. ఒత్తిడి పెరిగితే నిద్రలేమి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఒత్తిడి లేని జీవనాన్ని ఆస్వాదించాలి.
ఒకింత ఒత్తిడి మంచిదే..
ఒత్తిడి లేకుండా ఉండడం కష్టమే… ఒత్తిడితోనే జీవించాలి. కానీ ఒత్తిడి కూడా మనకు కొంత మంచి చేస్తుంది. జీవితంలో నిత్యం జరిగే ఆటుపోటులను తట్టుకోవడానికి కొంత ఒత్తిడి అవసరమే. దీన్ని ఒకరకంగా పాజిటివ్ స్ట్రెస్ అని చెప్పాలి. దీనివలన మనం చేయాలని అనుకునే పని సకాలంలో ముగించేస్తా. ఒత్తిడిలో డిస్ట్రెస్ ఒక రకం. ఇది మనిషిని అనారోగ్యాల పాలు చేస్తుంది.
మనమే కారణం
ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం మన మనస్తత్వం, ఆలోచనా ధోరణి. అది అలా జరిగితే బాగుండు ఇది ఇలా ఉంటే బాగుండు అని, అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాము. జీవితంలో పైకి రాలేమనో, ఏమీ సాధించలేము అనో, నిరాశ పడితై ఉంటాం.అకారణంగా భయపడటం కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. జీవితంలో జరిగే పెనుమార్పులు ,సంఘటనలు ,ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ,కలహాలు, మితిమీరిన అంచనాలు ,ప్రతీది పక్కాగా జరగాలి అని అనుకోవడం, అతిగా పట్టించుకోవడం లాంటివి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి.
ఒత్తిడిని వదిలించుకుందాం
ఒకటి రెండు రోజులు ఒత్తిడి ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు. దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం అనర్ధం తప్పదు. మరి ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం.
* మైండ్ ఫుల్ జీవన విధానం అలవర్చుకోవాలి. కలుపుగోలుతనం అలవర్చుకోవాలి. ఆచితూచి అడుగులు వేయగలగాలి.
* భావోద్వేగాలు కంట్రోల్లో ఉంచగలగాలి. సదవగాహనతో సానుకూలతతో ఫ్లెక్సిబుల్ గా ఉండగలిగితే ఒత్తిడి మటుమాయం. ఒత్తిడిని కలిగించే కారణాలు కనుక్కోగలిగితే పరిష్కారం దొరికినట్లే.
* ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఈరోజుకి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వడం నేర్చుకోవాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడకూడదు. బ్యాలెన్స్ డైట్ ని తీసుకోవాలి. నిద్ర వేళలు పాటించాలి. ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో తృప్తి లభిస్తుంది. దీన్ని అలవర్చుకోవాలి.
* రాత్రి వేళలో స్క్రీన్ కి అంటే మొబైల్ ,టీవీ ,లాప్టాప్ లకు దూరంగా ఉండాలి. మధురమైన సంగీతం వినాలి. ఇష్టమైన పరిమళాలు ఆస్వాదించాలి.
* రోజూ ఆహ్లాదాన్ని ఇచ్చే పనులు చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.
-సుమ కవిత
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ & సైకోథెరపిస్ట్
73823 10247
టాపిక్