అది ‘అసర్‌’ రిపోర్టు కాదు.. నారా లోకేశ్‌ నివేదిక

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ స్పష్టీకరణ

‘అసర్‌’ రిపోర్ట్‌ను మార్చేసిన విద్యా మంత్రి నారా లోకేశ్‌

జగన్‌ పాలనలో విద్యావ్యవస్థపై బురద జల్లడమే లక్ష్యం

నాడు–నేడుతో జరిగిన అభివృద్ధిని కప్పిపెట్టాలని కుట్ర

నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాయి

ఆ ఘనత పూర్తిగా నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారిదే

విద్యాశాఖలో సంస్కరణలతో నాడు ఏపీకి మంచి పేరు 

దాన్ని చెడగొట్టే కుట్రలో భాగంగా ‘అసర్‌’ రిపోర్టు తారుమారు

నాగార్జున యాదవ్‌ ఆక్షేపణ

విద్యాశాఖ వెబ్‌సైట్‌ లెక్కలే జగన్‌ చేసిన అభివృద్ధి చూపుతున్నాయి

కేంద్ర ప్రభుత్వ నివేదికలూ జగన్‌ గొప్పతనాన్ని చాటుతున్నాయి

అయినా మాయ చేయాలని నారా లోకేష్‌ తాపత్రయం 

ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన నాగార్జున యాదవ్‌

తాడేపల్లి:గత ఐదేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన వైయ‌స్‌ జగన్‌ దేశంలోనే టార్చ్‌బేరర్‌గా నిలిచారని, అది చూసి ఓర్వలేక ఆయన ప్రతిష్టను మసకబార్చడమే లోకేష్‌ పనిగా పెట్టుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుళ్లు కుతంత్రాలతో అసర్‌ రిపోర్టును లోకేష్‌ తారుమారు చేశారని ఆక్షేపించారు. తండ్రీ కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా వైయ‌స్‌ జగన్‌ గొప్పదనాన్ని, విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను విద్యాశాఖ వెబ్‌సైట్‌తోపాటు కేంద్ర నివేదికలు రుజువు చేస్తున్నాయని  స్పష్టం చేశారు. రాష్ట్రంలో పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రుల్లో ఎవరిని అడిగినా పిల్లల చదువుల కోసం వైఎస్‌ జగన్‌ తపించిన వైనాన్ని వివరిస్తారని చెప్పారు. 

వైయ‌స్ జగన్‌కు మంచి పేరు రావొద్దని:
    నడిచొచ్చే అబద్ధానికి చంద్రబాబు ప్రతిరూపమైతే, ఆ అబద్ధానికి వారసుడిగా లోకేశ్‌ కొనసాగుతున్నాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి అబద్దాలు, మోసాలే తమ పార్టీకి మూల స్తంభాలుగా మార్చుకున్నారు. విద్యాశాఖ సర్వేనూ తారుమారు చేసి అసత్యాలను జొప్పించి మాయ చేయాలని కుట్ర చేస్తున్నారు. 
    ‘అసర్‌’ సర్వే ప్రకారం జగన్‌ పాలనలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు పడిపోయాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌  ట్వీట్‌ చేశారు. అసలు ఆ సర్వే ఏమిటని చూస్తే..
ప్రథమ్‌ అనే స్వచ్చంద సంస్థ సాయంతో అసర్‌ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) సర్వే నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల్లో విద్యా రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై స్థానికంగా ఉండే డైట్‌ సంస్థల సిబ్బంది అంతా కలిసి ఈ సర్వే నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా రాష్ట్రంలో జరిగిన సర్వేలో పద్ధతి ప్రకారం తమాషా చేశారు. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విజాన్‌ ఫౌండేషన్‌కు చెందిన లా కాలేజీ, వైఎస్సార్‌ జిల్లాలోని ఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలేజీకి సంబంధించిన వారంతా కలిసి సర్వే చేశారు. 
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత జగన్‌ పాలనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న లోకేశ్‌.. డైట్‌ కాలేజీ సిబ్బందిని ప్రలోభపెట్టి మొత్తం వివరాలను తారుమారు చేసి తప్పుడు సమాచారాన్ని నివేదిక రూపంలో పొందుపరిచారు. చంద్రబాబు గత పాలన 2018లో ఉన్న విద్యా ప్రమాణాలు జగన్‌ అధికారంలోకి వచ్చాక దిగజారిపోయాయని చెప్పడమే లోకేశ్‌ ఉద్దేశం. విద్యావ్యవస్థ జగన్‌ పాలనలో దారి తప్పిందని చెప్పాలన్న కుట్రతోనే సర్వే సమాచారాన్ని లోకేశ్‌ తారుమారు చేశారు. 

విద్యార్థుల తల్లిదండ్రులే చెబుతారు:
    రాష్ట్రంలో పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రులు ఎవరిని అడిగినా ప్రభుత్వ బడులను జగన్‌ కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్దాలని తపించిన విషయాన్ని చెబుతారు. పిల్లల చదువుల కోసం ఆయన పడిన ఆరాటాన్ని వివరిస్తారు. పిల్లల యూనిఫాం, పుస్తకాలు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, మధ్యాహ్నం అందించిన గోరుముద్ద, మినరల్‌ వాటర్, నాడు–నేడుతో మారిన బడుల రూపురేఖలు, ఇంగ్లిష్‌ మీడియం, ఐబీ సిలబస్‌.. ఇవన్నీ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సంస్కరణలకు జగన్‌ టార్చ్‌ బేర్‌గా నిలిచారని రుజువు చేస్తాయి. 

వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది:
    జగన్‌గారు తొలి ఏడాదే గవర్నమెంట్‌ స్కూళ్లలో సమూల మార్పులపై దృష్టి పెట్టి, నాడు–నేడు మనబడి కార్యక్రమం చేపట్టారు. తొలి దశలో రూ.3,872 కోట్లు ఖర్చు చేసి 15,713 స్కూల్స్‌ని బాగు చేశారని నారా లోకేశ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖ వెబ్‌సైట్‌ లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. కానీ లోకేశ్‌ మాత్రం స్కూళ్లలో టాయిలెట్, తాగునీటి సౌకర్యాలు లేవని చెబుతున్నాడు. 
    అసలు వాస్తవాలు చూస్తే ఫేజ్‌–1లో బడుల్లో మరుగుదొడ్ల నిర్మాణం చూస్తే రూ.797 కోట్లు ఖర్చు చేసి 14,299 యూనిట్లు పూర్తి చేశారని ఆ వెబ్‌సైట్‌ స్పష్టం చేస్తోంది. దీంతోపాటు తాగునీటి సౌకర్యం కోసం రూ.413 కోట్లతో 14,536 పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 
    నాడు–నేడు రెండో దశలో చూస్తే.. రూ.7,676 కోట్లతో 22,311 పాఠశాలల్లో 70 శాతం పనులు పూర్తి చేశారని వెబ్‌సైట్‌ ప్రకారమే తెలుస్తోంది. దీంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వం డిసెంబర్‌ 21, 2023న స్వచ్ఛ విద్యాలయ ఇన్షియేటివ్‌ అనే కార్యక్రమంలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీలో 45,137 ప్రభుత్వ బడుల్లో బాలురకు 83 శాతం, బాలికలకు 96 శాతం టాయ్‌లెట్ల సౌకర్యం కల్పించారని ప్రశంసించింది.

యూడీఐఎస్‌ఈ రిపోర్టు ప్రకారం..:
    దేశవ్యాప్తంగా ఉన్న విద్యా ప్రమాణాలపై రాష్ట్రాల వారీగా యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) రిపోర్ట్‌ ఇస్తుంది. ఆ రిపోర్టును చంద్రబాబు దిగిపోయే ఏడాది 2018–19 సంవత్సరానికి, వైఎస్‌ జగన్‌ దిగిపోయిన 2023–24కి పోల్చి మౌలిక వసతుల సదుపాయాలను చూస్తే.. జగన్‌ హయాంలో బాలికల టాయ్‌లెట్లు 59,944. అదే చంద్రబాబు హయాంలో ఆ సంఖ్య కేవలం 26,367 మాత్రమే. అంటే, జగన్‌ హయాంలో స్కూళ్లలో బాలికల టాయిలెట్లు రెట్టింపు కంటే పెరిగాయి.
    ఇక  బాలుర టాయ్‌లెట్లు పరిశీలిస్తే జగన్‌ హయాంలో 42,627ఉండగా, చంద్రబాబు హయాంలో ఆ సంఖ్య కేవలం 21,438 మాత్రమే. అంటే అవి కూడా జగన్‌ హయాంలో, చంద్రబాబు టైమ్‌తో పోలిస్తే, రెట్టింపు కంటే పెరిగాయి.
    ఇంకా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) చూసినా, వైయ‌స్ జగన్‌గారి హయాంలో 95 శాతానికి పైగా నమోదు కావడం విశేషం. ఈ రెండు రిపోర్టులు చూస్తే, ఎవరి సామర్థ్యం ఏమిటో తెలిసిపోతుంది. 

అది నిరూపించే సత్తా ఉందా?:
    ఈ సందర్భంగా విద్యా మంత్రి నారా లోకేశ్‌ను నేను సవాల్‌ చేస్తున్నాను. వైయ‌స్ జగన్‌గారి పాలనలో నాడు–నేడు మనబడి కింద రెండు దశల్లో దాదాపు 37,450 స్కూళ్ల రూపురేఖలు మారాయని మేము తేల్చి చెబుతున్నాం. అది నిజం కాదని నిరూపించే సత్తా మీకుందా?. ఆ పనులు జరగలేదని నిరూపించగలరా?. ఇదే మా సవాల్‌.
    మీరు అధికారం చేపట్టాక, కనీసం ఒక్కటంటే ఒక్క స్కూల్‌నైనా బాగు చేశారా? పిల్లల కోసం ఒక్క పథకం అయినా అమలు చేశారా? అమ్మ ఒడి ఎగ్గొట్టారు. విద్యాదీవెన, వసతిదీవెనకు మంగళం పాడారు. నాడు విద్యా రంగంలో జగన్‌గారు అమలు చేసిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలవారూ అభినందించారు. తమ దగ్గర అమలుకు చొరవ చూపారు. ఇది వాస్తవం. అందుకే ఇప్పటికైనా మంత్రి నారా లోకేశ్, ఇలా రిపోర్టులు తారుమారు చేసి, బురద చల్లడం మానుకోవాలని నాగార్జునయాదవ్‌ సూచించారు.

Best Web Hosting Provider In India 2024