



Best Web Hosting Provider In India 2024
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Vizag Steel Plant : ఓవైపు జీతాలు రావడం లేదని కార్మికులు ఆందోళన బాటపట్టారు. మరోవైపు కేంద్రమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. ప్రైవేటీకరణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన మాటలను నమ్మబోమని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అటు ప్లాంట్ నష్టాలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్కు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని.. కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు.

పరిశ్రమ సాధన కోసం..
అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం 30 మంది వరకు మరణించారని చెప్పారు. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదన్న కుమారస్వామి.. 2013-14 వరకు ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందని వివరించారు. 2014లో నవరత్న హోదా సాధించిందని గుర్తు చేశారు.
కేంద్రమంత్రి అయ్యాక..
‘నేను కేంద్ర మంత్రి అయ్యాక విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నోసార్లు సమీక్షలు చేశా. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌కు రూ.35వేల కోట్ల అప్పు ఉంది. దాన్ని ఎలా తీర్చాలనేదానిపై ఆలోచిస్తున్నాం. 2030 లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం’ అని కుమారస్వామి హామీ ఇచ్చారు.
ప్రత్యేక ప్యాకేజీ..
ఈ మధ్యే విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకరించింది. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమవుతాయని.. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ముడి సరకు సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో చర్చిస్తున్నామని.. ఆత్మనిర్భర్ భారత్‌లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిరసన సెగ..
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్తుండగా.. కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం చేయాలి.. సొంతంగా గనులు కేటాయించాలి.. అంటూ నినాదాలు చేశారు.
టాపిక్