Best Web Hosting Provider In India 2024
కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఆదేశం మేరకు నివేదికకు ఒత్తిడి
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిట్ చీఫ్‌కు అల్టిమేటం.. స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి.. ఆ పేర్లు పెట్టాలని హుకుం
కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్
తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ
అలా కుదరదంటూ సీఐడీ చీఫ్, డీజీపీ ఆగ్రహం.. రాజీనామా చేస్తానని తేల్చి చెబుతూ సెలవులో వెళ్లిన బ్రిజ్‌లాల్
ఫలితంగా సీఐడీ నుంచి ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం
అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు.
దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్‌లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది.
సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు.
పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి
తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది.
సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది.
డీజీపీదీ అదే మాట..
బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు.
అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం.
ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు.
ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.
త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు!
తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి.
డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి.