Best Web Hosting Provider In India 2024
Kaloji Health University : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ.. ఇదేం దుస్థితి.. ఖాళీగా కీలక పోస్టులు!
Kaloji Health University : వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేలాదిమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతారు. తెలంగాణలో వైద్య విద్య పర్యవేక్షణ కోసం.. పదేళ్ల కిందట కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ.. ఇప్పటివరకు కీలక పోస్టులను భర్తీ చేయలేదు.
తెలంగాణలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కింద దాదాపు 350 యూజీ, పీజీ వైద్య, దంత, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు 105 పోస్టులు అవసరం. వాటిని భర్తీ చేయాలి. కానీ ప్రస్తుతం 40 నుంచి 45 మందే పనిచేస్తున్నారు. జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉండాలి. వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్ పోస్టులకు మినహా.. మిగతా వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
పదేళ్లు గడుస్తున్నా..
ఫలితంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పాలన గాడి తప్పుతోంది. పదేళ్లు గడుస్తున్నా కీలక విభాగాలను గాడినపెట్టే వారు లేరు. గతేడాది జూన్‌లో వీసీ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పరీక్షల నిర్వహణ విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టులో ఎంబీబీఎస్ చేసిన వారు ఉండాలి. కానీ దంత వైద్యుడినే కొన్నేళ్లుగా డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు.
పరీక్షల్లోనూ నిర్లక్ష్యం..
వైద్య విద్యలో పరీక్షలు ఎంతో కీలకం. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. నష్టం తప్పదు. కానీ ప్రశ్నాపత్రాల రూపకల్పనలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రేడియాలజీ విభాగంలో గతేడాది వచ్చిన ప్రశ్నపత్రాన్నే తిరిగి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పీజీ ఫైనలియర్ పరీక్షలను కూడా సడెన్‌గా వాయిదా వేశారు. పరీక్షల జాప్యం వల్ల విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయే దుస్థితి నెలకొంది.
పర్యవేక్షణ ఏదీ..
ఇక ప్రైవేట్ కాలేజీలపై పర్యవేక్షణ కొరవడిందనే వాదన ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాన్ని తీసుకుంటున్నాయి. కానీ.. ఈ సమస్యలను యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మిగతా వర్సిటీల్లోనూ..
కేవలం కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన వంటి యూనివర్సిటీల్లో దాదాపు 70 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఫలితంగా ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించడానికి ఇబ్బందలు తలెత్తుతున్నాయి. ఇటు విద్యార్థుల పరిశోధనలు కూడా ముందుకు సాగడం లేదు. యూనివర్సిటీలపై ప్రభుత్వం దృష్టిపెట్టి.. ఖాళీలను భర్తీ చేయలాని విద్యార్థులు కోరుతున్నారు.
టాపిక్