Best Web Hosting Provider In India 2024
Basara Saraswathi Temple : వసంత పంచమికి బాసరలో భారీ ఏర్పాట్లు, అక్షరాభ్యాసాలు తప్ప ఇతర సేవలు రద్దు
Basara Saraswathi Temple : వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాసాలు తప్ప ఇతర సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారుల తెలిపారు.
Basara Saraswathi Temple : చదువుల మాత సరస్వతీ దేవీ కొలువై ఉన్న బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రానికి ఉత్సవకళ సంతరించుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ప్రతిసారిలాగే ఈ సారి కూడా దేవస్థానం ఆధ్వర్యంలో అదనపు క్యూ లైన్లు తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాన్నింటికి రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఏర్పాట్ల పైన ముథోల్ ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
ఈసారి వసంత పంచమి వేడుకల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకదృష్టి సారించింది. మొదటి నుంచి ముథోల్ ఎమ్మెల్యే రాంరావు పటేల్ వేడుకల నిర్వహణపై శ్రద్ధ వహించారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించరాదంటూ అధికారులను అప్రమత్తంగా చేశారు. జిల్లా ఇన్ ఛార్జ్ సీతక్క కూడా ఏర్పాట్లపై బాసర వచ్చి పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.
ఈసారి ఉత్సవాలకు రెండు రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భైంసా డివిజన్ పరిధిలోని పోలీసులందరూ వసంతపంచమి వేడుకల్లో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీ జానకిషర్మిల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అక్షరాభ్యాసాలు తప్ప ఇతర సేవలు రద్దు
మూడు రోజుల ఉత్సవాల రోజుల్లో ఆలయంలో భక్తులు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో మార్పులు చేశారు. ఉత్సవాలకు వచ్చే యాత్రికుల్లో 90 శాతం అక్షర శ్రీకార భక్తులు ఉన్నందున మిగతా భక్తులు నిర్వహించుకునే అభిషేకం, కుంకుమార్చన, ఇతర పూజా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు : కలెక్టర్
వసంత పంచమిని పురస్కరించుకొని బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బాసరలో పర్యటించిన కలెక్టర్ వసంత పంచమివేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి నది తీరంలో పుష్కరఘాట్ లో అధికారులతో కలిసి పర్యటించారు.
నదీ తీరంలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులను మరిన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నది వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అనంతరం దేవస్థాన అతిథిగృహంలో ఆలయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్మ హించారు.
ఆలయం వద్ద కూడా బేబీ పీడింగ్ ప్రదేశాలను, బయో టాయిలెట్లను, తాగునీటిని నిరంతర పారిశుద్ధ్య పనులను కొనసాగించాలని ఆశించారు. ప్రతీచోట భక్తులకు సౌకర్యవంతంగా బోర్డులను, కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. భైంసా ఆర్డీవో కోమల రెడ్డిని ఉత్సవాల ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
టాపిక్