Best Web Hosting Provider In India 2024
TG Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి వర్సెస్ ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి- ఉత్తర తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు
TG Mlc Elections : ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమైంది.
TG Mlc Elections : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించేనా? కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? అంటే రెండు అధికార పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్ గానే మారింది. పట్టభద్రుల స్థానం నుంచి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దింపగా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యింది. డజన్ మందికి పైగా స్వతంత్రులు పోటీకి సిద్ధమైన తరుణంలో అధికార పార్టీలకు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు పోటీకి ఆసక్తి చూపుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ తరఫున సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని అధికార పార్టీలు బరిలోకి దింపుతున్నాయి.
ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తులే కావడం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఓ అడుగు ముందుకేసి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మాల్క కొమురయ్యను ఎంపిక చేసింది. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా పోటీ చేసేవారిలో ఒకరికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు అధికార పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలను తీసుకోవడంతో ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలమనే లెక్కల్లో రాజకీయ విశ్లేషకులు నిమగ్నమయ్యారు.
సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుందా?
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంటే ఉత్తర తెలంగాణలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉన్న బీజేపీ కమలం వికసించేలా కార్యాచరణ రూపొందించింది. పాతిక రోజుల క్రితమే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో నిమగ్నమైంది. ఇక కాంగ్రెస్ షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే అభ్యర్థులు ఖరారు చేసి ప్రకటించింది.
ముందుగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే బరిలోకి దింపాలని భావించినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. నరేందర్ రెడ్డి గత కొంతకాలంగా పట్టభద్రుల ఓటర్ నమోదు తో పాటు విద్యాసంస్థ పరంగా నాలుగువేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వేలాదిమంది విద్యార్థుల పేరెంట్స్ తో ఉన్న పరిచయాలు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ భావిస్తుంది.
పోటీకి బీఆర్ఎస్ దూరం?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నయం అన్నట్లుగా భావిస్తుంది. ఆ పార్టీ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టికెట్ ఆశిస్తూ ప్రచారాన్ని చేపట్టారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2018లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో నిలపలేదు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ కు మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే పోటీలో అభ్యర్థి నిలపకుండా, మద్దతిచ్చిన అభ్యర్థి గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం రెండు అధికార పార్టీల మధ్య గెలుపు అసాధ్యమని భావిస్తుంది. పార్టీ పరంగా పోటీ చేయకపోవడమే గౌరవంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని పక్కన పెడితే స్వతంత్ర అభ్యర్థులుగా పాతికమంది బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఎల్లుండి నుంచే నామినేషన్ లు
మార్చి 29తో ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి ఈనెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 3 లక్షల 41 వేల 313 మంది పట్టభద్రుల ఓటర్లు… 25 వేల 921 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు.
15 జిల్లాల పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రుల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల పోలింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతా చదువుకున్న వారు, డిగ్రీ పట్టాలున్నా మేధావి వర్గమే ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎత్తుగడలు ఏ మేరకు పనిచేస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్