Best Web Hosting Provider In India 2024
Jagtial News : కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల మహిళలు, ఎస్పీ చొరవతో ఆచూకీ లభ్యం
Jagtial News : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లి తప్పిపోయిన నలుగురు జగిత్యాల మహిళల ఆచూకీ లభించింది. జిల్లా ఎస్పీ ప్రయాగ్ రాజ్ పోలీసులను సంప్రదించి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. వారిని ఇవాళ జగిత్యాలకు తీసుకొచ్చారు.
Jagtial News : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనడానికి జగిత్యాల జిల్లాకు చెందిన 11 మంది మహిళలు ఈ నెల 27న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. 29వ తేదీ సాయంత్రం వారు ప్రయాగ్ రాజ్ లోని సంఘం ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి రెండు గ్రూపులుగా విడిపోయి వెళ్లారు. ఈ క్రమంలో ఏనుగుల బుచ్చవ్వ, మరో ముగ్గురు మహిళలు బెల్లపు సత్తవ్వ, వీర్ల నరసవ్వ, ఆది రాజవ్వ జనసందోహంలో తప్పిపోయారు.
జిల్లాకు చెందిన 4 గురు మహిళలు తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఆ మహిళల వివరాలు తెలుసుకొని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పోలీసుల సహాయంతో నలుగురి మహిళల ఆచూకీ కనుక్కున్నారు. ఇవాళ ఉదయం వారిని జగిత్యాలకు తీసుకువచ్చారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తప్పిపోయిన మహిళలను సురక్షితంగా తీసుకొచ్చిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పోలీసులకు మహిళల కుటుంబాల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
టాపిక్