Best Web Hosting Provider In India 2024
TG Caste Survey : బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వానివి కాకి లెక్కలు : కల్వకుంట్ల కవిత
TG Caste Survey : తెలంగాణలో కుల గణనపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. బీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. హస్తం పార్టీపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శలు గుప్పించారు.
కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శించారు. ఏ లెక్కన చూసినా.. తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చిందని వ్యాఖ్యానించారు. ఇది కరెక్టే అని రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుమానంగా ఉంది..
‘జనాభా లెక్కలపై అనుమానం ఉంది. మీరు చేసిన లెక్కలు కరెక్టే అయితే.. సర్వేలో నేను ఇచ్చిన వివరాలు, నా పేరు, ఆధార్ కార్డు నంబర్ కొడితే రావాలి. మూడు కోట్ల 50 లక్షల మంది సర్వే రిపోర్ట్లు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలి. ఇది చిన్న విషయం కాదు. ప్రభుత్వం ఆగమాగం చేస్తుంది. మంత్రివర్గ సమావేశం, ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం, దాంట్లో లఘు చర్చనట. బీసీ జనాభా అంటే చిన్న చూపా’ అని కవిత ప్రశ్నించారు.
56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..
‘మీ లెక్కల ప్రకారమే 46.2 శాతం బీసీ, ముస్లిం మైనార్టీలకు 10 శాతం మొత్తం.. 56 శాతం రిజర్వేషన్ కల్పించండి. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఇంకా మిస్ అయిన వారి కోసం మళ్లి అవకాశం ఇవ్వాలి. 15 రోజుల పాటు రివ్యూకు అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తర్వాత బీసీ సంఘాలను కలుపుకొని.. రిజర్వేషన్ దక్కే వరకు పోరాడుతాం. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి.. రిజర్వేషన్లు కల్పించాలి’ అని కవిత డిమాండ్ చేశారు.
పొన్నం ఫైర్..
ఇటు బీఆర్ఎస్ తీరుపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ‘కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి. బలహీన వర్గాల కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమం లాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కుల గణన చేస్తామని మాట ఇచ్చాం. చేసి చూపించాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
వారందరికీ హ్యాట్సాఫ్..
‘కుల గణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. కుల గణన కోసం పోరాటం చేసిన వారందరికీ హ్యాట్సాఫ్. నిర్ణయం నుండి నివేదిక దాకా కుల గణన ప్రక్రియలో ఉన్నందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ ఉత్సవాలు జరపాలి. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాం. దీని ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
టాపిక్