Best Web Hosting Provider In India 2024
Nandigama Murder Plan: ప్రేమ పెళ్లికి సాయం చేసిన స్నేహితుడి హత్యకు సుపారీ ఇచ్చిన యువతి తండ్రి, నిందితుల అరెస్ట్
Nandigama Murder Plan: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన స్నేహితుడిని హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన తండ్రి కటకటాల పాలయ్యాడు. ప్రేమ పెళ్లికి సహకరించిన వ్యక్తని చంపేందుకు కిరాయి మూకతో ఒప్పందం చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుల్ని రిమాండ్‌కు పంపారు.
Nandigama Murder Plan: ఎన్టీఆర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై రగిలిపోయిన యువతి తండ్రి, వారికి సహకరించిన యువకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు. జిల్లాలోని నందిగామకు చెందిన యువతీయువకులు పెళ్లి చేసుకున్నారు.
ఈ ప్రేమ వివాహం ప్రేమికురాలి తండ్రికి ఇష్టం లేదు. దీంతో వారికి పెళ్లికి సహకరించిన వ్యక్తిని హతమార్చేందుకు ప్రేమికురాలి తండ్రి సుపారీ ఇచ్చారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రేమికురాలి తండ్రితో సహా మరో ముగ్గురు నిందితులు పోలీసులకు అడ్డంగా దొరికారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. దీంతో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వా వీర్రాజు, అదే జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు పెద్ద కుమార్తె రమ్యశ్రీ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 14 నెలల కిందట వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి వీర్రాజు బంధువు మువ్వా గోపి సహకరించారు. దీంతో వారిపై రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు కక్ష కట్టాడు. గోపిని ఎలాగైన హతమార్చాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
దీంతో యువతి తండ్రి నరసింహారావు హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన పాలంపల్లి విజయ్‌కుమార్‌ను కలిసి యువకుడు గోపీని హత్య చేయాలని రూ.లక్ష ఇచ్చేందుకు సుపారి కుదుర్చుకున్నాడు. సంక్రాంతి పండగకు నరసింహారావు, విజయ్‌కుమార్‌లు మరో ఇద్దరితో కలిసి మువ్వా వీర్రాజు స్వగ్రామం ఐతవరానికి వచ్చారు. గోపిని అంతమొందించేందుకు మూడు రోజుల పాటు ఐతవరంలోనే రెక్కీ నిర్వహించారు. హత్యకు కోడికత్తులు కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడు వీలు కాకపోవడంతో వెనుదిరిగారు.
మళ్లీ ఫిబ్రవరి 2 (ఆదివారం)న నందిగామ వెళ్లి అక్కడ మయూరి టాకీస్ సెంటర్లో అనుమానంగా తిరుగుతున్నారు. దీంతో స్థానికులు సీఐ లచ్చునాయుడికి సమాచారం అందించారు. వెంటనే తన సిబ్బందితో సీఐ అక్కడకు చేరుకున్నారు. రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు, సుపారీ తీసుకున్న విజయ్‌కుమార్, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. దీంతో హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది.
నిందితుల నుంచి రెండు కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు కోలా నరసింహారావు, విజయ్‌కుమార్‌తో పాటు చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన బాణాల గోపీరాజు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నర్శింహపట్ల గ్రామానికి చెందిన చింతగింజ సైదులును పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. దీంతో జడ్జి వారికి రిమాండ్ విధించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్