Best Web Hosting Provider In India 2024
Tirupati Deputy Mayor : ఉత్కంఠకు తెర, తిరుపతి డిప్యూటీ మేయర్ టీడీపీదే-బలప్రయోగంతో గెలిచారని వైసీపీ ఆరోపణలు
Tirupati Deputy Mayor : తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్య డిప్యూటీ మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. కిడ్నాప్ లు, బెదిరింపుల ఆరోపణల మధ్య ఎన్నిక ముగిసింది.
Tirupati Deputy Mayor : తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారమే డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా, తగిన కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది.
తిరుపతి మున్సిపాలిటీలో మొత్తం 50 మంది కార్పొరేటర్ల స్థానాలకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం నగరపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా 50 మంది సభ్యులకు సగం మంది అంటే 25 మంది హాజరు అవ్వాల్సి ఉండగా, నిన్న ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు.
నాటకీయ పరిణామాలు
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల జరిగింది. కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి, కిడ్నాప్ చేసి ఓటింగ్ కు రాకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికపై నిన్నటి నుంచి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి సహా కార్పొరేటర్లు ఓటింగ్ కోసం బస్సులో బయలుదేరగా వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో తమ కార్పొరేటర్లకు పోలీస్ భద్రత కల్పించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని హైకోర్టు తిరుపతి ఎస్పీని ఆదేశించింది.
కిడ్నాప్ లు- వీడియోలు
ఇదిలా ఉండే…మంగళవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించింది. నిన్న రాత్రి నుంచీ ఎమ్మెల్సీ కనిపించడంలేదని ఆయనను కిడ్నాప్ చేశారని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉన్నట్లు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఓ వీడియో విడుదల చేశారు. పలువురు కార్పొరేటర్లు సైతం వీడియోలు విడుదల చేశారు.
వైసీపీ విమర్శలు
మున్సిపల్ కౌన్సిల్ లో కూటమి పార్టీలకు బలం లేకపోయినా బలప్రయోగంతో మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడిందని వైసీపీ ఆరోపించింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, బెదిరించి ఓటింగ్ కు రాకుండా చేశారని పేర్కొంది. హిందూపురంలో కూడా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లి ఛైర్మన్ పదవిని కాజేశారని ఆరోపించింది. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని వైసీపీ విరమ్శలు చేసింది.
నందిగామలో
నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ ఛైర్మన్‌గా మండవ కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. టీడీపీకి 15, వైసీపీకి 3 ఓట్లు పడటంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటు వేశారు.
నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై మూడ్రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓ పేరును ప్రతిపాదించగా, ఎంపీ కేశినేని శివనాథ్ మరో పేరు ప్రతిపాదించారు. దీంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్టానం రంగంలోకి ఎంపీ, ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లు కాకుండా మరోపేరును ప్రతిపాదించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. అధిష్టానం సూచించిన కృష్ణకుమారిని సభ్యులు ఛైర్మన్ గా ఎన్నుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్