అప్పులే సరి.. సంపద ఎక్కడమరి? 

Best Web Hosting Provider In India 2024

ఏడాది తిరక్కుండానే బాబు సర్కారు అప్పులు రూ.1.26 లక్షల కోట్లు 

తాజాగా 7.17% వడ్డీతో రూ.5,820 కోట్ల అప్పు

దీంతో బడ్జెట్‌ అప్పులే రూ.80,827 కోట్లు

బడ్జెట్‌లో పేర్కొన్న రూ.71 వేల కోట్లకు మించి మార్కెట్‌ రుణాలు

బడ్జెటేతర అప్పులు రూ.45,700 కోట్లు

ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌ మాత్రం లేదు 

అమరావతి: అప్పుల మీద అప్పులు చేయ­డమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్‌ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. 

ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్‌లోనే కేవలం మార్కెట్‌ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్‌లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. 

బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్‌ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.

కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనం
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ బయట, బట్జెట్‌ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. 

ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్‌ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్‌ వరకు మార్కెట్‌ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్‌ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. 

ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్‌సిక్స్‌ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్‌ సిక్స్‌ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తుండటం గమనార్హం.

Best Web Hosting Provider In India 2024