Best Web Hosting Provider In India 2024
TGRTC Strike: సమ్మెకు సిద్ధం అంటున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు… ఈనెల 9నుంచి ఆందోళనలకు ప్రణాళికలు
TGRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. ఫిబ్రవరి 9నుంచి ఆందోళనలకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
TGRTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అవుతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9 నుంచి సమ్మెకు దిగేందుకు యూనియన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, కారుణ్య నియామకాలు చేసినవారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే.. తదితర డిమాండ్లతో సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు కరీంనగర్ రీజియన్ పరిధిలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి జిల్లా చైర్మన్ ఎంపీ.రెడ్డిని ఎన్నుకున్నారు.
9 నుంచి సమ్మెలోకి….
ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ మేనేజ్మెంట కు ఎన్నోసార్లు విన్నవించామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన హమీలను ఉల్లంఘిస్తూ ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని, కార్మికులను వేధించడం, గేట్మీటింగ్ ల ద్వారా యాజమాన్యం వేధించడం, భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 9నుంచి సమ్మె చేయడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
వెల్ఫేర్ కమిటీలతో ఒరిగింది శూన్యం…
ఆర్టీసీలో కార్మిక సంఘాలను నిషేధించి ప్రభుత్వం మూడేళ్ళ క్రితం వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఆ కమిటీల ద్వారా ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని కార్మికులు అంటున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే యూనియన్లను అనుతివ్వాలని కోరుతున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని ఆశించామని, కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని భయపడే ప్రసక్తే లేదని, సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సంస్థ ఎండీకి సమస్యలపై ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్స్…
- ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలి.
- కార్మికులపై పనిభారం తగ్గించాలి.
- డిపోల పరిధిలో కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించాలి.
- ఎస్ఆర్ బీఎస్, ఎస్బీటీలను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.
- పీఎఫ్, సీసీఎస్ వడ్డీ సహా డబ్బు చెల్లించాలి.
- స్వచ్ఛంద ఉద్యోగ విరమణను ఉపసంహ రించుకోవాలి. డిపోల మూసివేతను ఉపసంహరించుకోవాలి.
- కొత్త బస్సులు కొనుగోలు చేయాలి.
- టికెట్ తీసుకోకుంటే ప్రయాణికుడినే బాధ్యుడిని చేయాలి.
- 2017, 2021 వేతన సవరణ చేయాలి.
- 2019 నుంచి రావాల్సిన డీఏలు చెల్లించాలి.
- 2019లో సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులు ఎత్తివేయాలి.
- ఉద్యోగ విరమణ చేసిన వారికి సెటిల్మెంట్లు చెల్లించాలి.
- అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి.
- పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి డ్రైవర్, కండక్టర్, మెయిన్స్టనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
- మృతిచెందిన ఉద్యోగులు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్)
టాపిక్