Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/sailajanath.jpg)
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైయస్ఆర్‌సీపీ చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయనకు కండవా కప్పి వైయస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైయస్ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైయస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చి..
వైయస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే తాను వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు శైలజానాథ్ తెలిపారు. వైయస్ఆర్‌సీపీ ప్రజల తరుపున పోరాడుతుందని, వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్ విమర్శించారు.
మరికొందరు నేతలు వస్తారు:
‘‘కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. వైయస్ జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తా. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తా.. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదు’’ అని శైలజానాథ్ చెప్పారు.