Best Web Hosting Provider In India 2024
Telangana : మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా…! సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలనే దానిపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. కసరత్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కేబినెట్ విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని చెప్పారు. ఇప్పట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనంటూ సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే విషయంలో తాను ఎవరిని రికమండ్ చేయడం లేదన్నారు.
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అత్యవసరంగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.
పీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యం అని చెప్పారు. రాహుల్ గాంధీతో తన అనుబంధం గురించి తెలియని వారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
కుల గణన ఆషామాషీగా చేసింది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. బీసీల జనాభా ఎక్కడా కూడా తగ్గలేదన్నారు. దాదాపు 5 శాతానికిపైగా పెరిగిందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలోని నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
కేబినెట్ విస్తరణపై ఆశలు:
చాలా రోజులుగా మంత్రివర్గ విస్తరణపై ఊహగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు కూడా వీటిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. అయితే ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక్కడ లెక్కలు మారిపోతున్నాయి.ఇదే జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్