Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం
ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైయస్ జగన్
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపణ
ఆర్థిక విధ్వంస అనడం తప్ప చంద్రబాబుకు మరొకటి చేతకాదు
అధికారం కోసం అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేశారు
బాబు ష్యూరిటీ… భవిష్యత్ గ్యారెంటీ ఏదీ?
హామీల అమలుపై కాలర్ పట్టుకోమన్నారు
ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో లోకేష్ చెప్పాలి
మాజీ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు: ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్ జగన్ గారికి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలను వంచిస్తున్న వైనంపై వైయస్ జగన్ గారు వేసిన సూటి ప్రశ్నలకు కూటమి నేతలు బదులివ్వలేక కంగారు పడుతున్నారని అన్నారు. తమ అసమర్థతను దాచుకుంటూ వైయస్ జగన్ గారిపై రాజకీయపరమైన విమర్శలతో చెత్త మాటలు, అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే…
వైయస్ జగన్ గారు కూటమి ప్రభుత్వ వైఖరిపై, హామీల అమలు, ప్రజలను మోసం చేస్తున్న వైనంపై ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలపై ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. దానికి బదులుగా వైయస్ జగన్ గారిపై అర్థంలేని విమర్శలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్ గారు ఈ 8 నెలల్లో పలుసార్లు మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వాటిపై ఒక్కసారి కూడా ఈ కూటమి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పలేకపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే జగన్ గారి ప్రశ్నలకు మా సమాధానం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై అనేక అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు. ప్రజలకు అనేక హామీలను ఇస్తూ తాము అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామంటూ నమ్మించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతి దానికీ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలతో కాలం గడుపుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే ‘బాబు ష్యూరిటీ… భవిష్యత్తుకు గ్యారెంటీ’ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడగాలని నారా లోకేష్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల్లో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఎవరి కాలర్ పట్టుకుని ప్రశ్నించాలో ఇదే నారా లోకేష్ ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ పదేపదే చెప్పడం తప్ప చంద్రబాబుకు మరొకటి చేతకాదు. చంద్రబాబులా కాకుండా వైయస్ జగన్ గారు తాను ఇచ్చిన ప్రతి హామీని చేయగలనా? లేదా? అని పరిశీలించిన తరువాతే వాటిని ప్రకటించారు. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తూచా తప్పకుండా అమలు చేశారు.
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరు
వైయస్ జగన్ గారి హయంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ఇదే చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఇటీవలి బడ్జెట్ లో కేవలం రూ.6 లక్షల కోట్లు అని తేల్చారు. అంటే చెప్పేది ఒకటి, వాస్తవం మరొకటి అనేది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీనిపైన కూడా చంద్రబాబు పచ్చి అబద్దాలకు తెగబడ్డాడు. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగిందంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసత్యాలను ప్రకటించడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. తనకు అనుకూలమైన ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఈ అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. వైయస్ఆర్ సీపీ హయాంలో ఎక్కడా ఒక్క పైసా అవినీతి లేకుండా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. బటన్ నొక్కి లబ్ధిదారులకు సొమ్మును జమ చేయడం మూలన ఉన్న ముసలమ్మ కూడా చేస్తుందని చంద్రబాబు డీబీటీని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మరి చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండి ఎందుకు బటన్ నొక్కలేక పోతున్నాడు? బటన్ నొక్కే సామర్థ్యం చంద్రబాబుకు లేదు. నీతిఅయోగ్ లెక్కలను అడ్డం పెట్టుకుని కూడా చంద్రబాబు వక్రీకరణ వాదనలను వినిపించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రూ.2437 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2019-24 వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.5224 కోట్లు ఖర్చు చేశాం. దీనిని కూడా తల్లకిందులు చేసి తమ హయాంలోనే ఎక్కువ ఖర్చు చేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా లిక్కర్ స్కాంలో మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించారు. ఒక ఎంపీగా ఉన్న మిధున్ రెడ్డి, ఎక్సైజ్ శాఖకు సంబంధం లేని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా చర్యలు అంటూ ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. దానికి అనుగుణంగా సిట్ వేశామంటూ నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు రాజకీయ బతుకంతా అసత్యాలు, అన్యాయాలు, అక్రమాలపైన నిర్మించుకున్నదే.
– మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ…
వైయస్ఆర్సీపీ నుంచి పార్టీ మారిన వారు చంద్రబాబు ప్రాపకం కోసం కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నారు. కింది నుంచి రెండో ర్యాంక్ లో ఉన్న మంత్రి పార్థసారధి మాటలు ఇందుకు నిదర్శనం. ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధానిని నిర్మిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఈ అప్పుల్లో సగం స్వాహా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అమరావతి నిర్మాణంను మేం వద్దని అనలేదు. అమరావతిని నిర్మించమనే చెబుతున్నాం. అయిదేళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు చెప్పిన అమరావతి నిర్మాణం ఏ మేరకు చేశారు. ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు కేవలం రోడ్లకే అప్పుగా తీసుకువస్తున్నారు. గతంలో కేంద్రప్రభుత్వం రూ.2500 కోట్లు రాజధాని కోసం ఇస్తే, వాటిని చంద్రబాబు ఎలా ఖర్చు చేశారో అందరూ చూశారు.
సూపర్ సిక్స్ హామీలకు గ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చి పడుకున్నాడు. కేబినెట్ సమావేశంకు కూడా వెన్నుపూస నొప్పి వల్ల రాలేదని అంటున్నారు. ఆయన ఎందుకు సిక్ అయ్యారో తెలియదు. సింగపూర్ కు వెళ్లారో, లేదా షూటింగ్ కు వెళ్ళారో, ఢిల్లీ ప్రచారానికి కూడా వెళ్ళలేనంత జ్వరంతో ఉన్నారా అనే దానిపై నాకు స్పష్టత లేదు. చంద్రబాబు, లోకేష్ మీద పవన్ కళ్యాణ్ అలిగాడనే చర్చ జరుగుతోందని విలేకరులు ఇప్పుడు అడగడం వల్లే నాకు తెలిసింది. అంతకు మించిన సమచారం నా వద్ద లేదు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదటి పేజీల్లోనే ఉంటుంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, వైయస్ఆర్‌సీపీలో చేరినప్పుడు, తిరిగి టీడీపీలో చేరినప్పుడు ఏం మాట్లాడారో రికార్డులు పరిశీలిస్తే ఆయన మాటలకు ఉన్న విలువ, చిత్తశుద్ది అర్థమవుతుంది. మాజీ మంత్రి శైలజానాథ్ ను విమర్శించే స్థాయి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు లేదు. మరో ఆరు నెలల తరువాత చంద్రబాబు అంత దళిత ద్రోహి ఎవరూ లేరు అని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నా కూడా ఆశ్చర్యపోనక్కరలేదు.