![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/TG_MLC_Elections_2025_1738942143786_1738942149745.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/TG_MLC_Elections_2025_1738942143786_1738942149745.jpg)
TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ నామినేషన్లకు దగ్గరపడిన గడువు – భారీగా నామినేషన్లు దాఖలు
ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదో రోజు పట్టభద్రుల స్థానానికి 28 మంది, టీచర్ల స్థానానికి ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణకు ఒక్కరోజు సోమవారం మాత్రమే గడువు ఉంది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.
కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. పట్టభద్రుల స్థానానికి శుక్రవారం కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులతోపాటు 30 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి అప్పగించారు. అటు బిజేపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. గడిచిన ఐదు రోజుల్లో పట్టభద్రుల స్థానానికి 49 మంది నామినేషన్ వేశారు.
టీచర్స్ ఎమ్మెల్సీకి 9 మంది నామినేషన్…
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఇద్దరు నామినేషన్ వేశారు. పీఆర్టీయూ అభ్యర్థిగా మహిపాల్ రెడ్డి తో పాటు బిజేపి అభ్యర్థి మల్క కొమురయ్య తరపున మల్క నవీన్ నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన ఐదురోజుల్లో టీచర్స్ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.
నామినేషన్ల స్వీకరణకు శని, ఆదివారాలు సెలవు. ఇక నామినేషన్ల స్వీకరణకు ఒకరోజు మాత్రమే గడువు ఉంది. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. చివరి రోజున భారీ సంఖ్యలో నామినేషన్ లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్ల లో అధికారులు నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ కు గిఫ్ట్ ఇస్తా-నరేందర్ రెడ్డి..
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో తల్లిదండ్రులు సతీమణితో కలిసి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందని నరేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్సీగా గెలిచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, లొటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెట్టడంతోనే ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు అందుకుంటున్నారని తెలిపారు. చివరి రోజు సోమవారం భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అదే రోజు నవరత్నాల మేనిఫెస్టో ప్రకటిస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు.
శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా- అంజిరెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి పాల్వాయి హరీష్ తో కలిసి కరీంనగర్ లో నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు నిరుద్యోగులు ఉద్యోగులు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే చాలా మంది సమయం మించిపోయిన తర్వాత పలువురు నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ చేరుకున్నారు. అప్పటికే సమయం అయిపోయిందని పోలీసులు గేట్ వద్దనే నిలిపివేశారు. కొంత మంది అభ్యర్థులు చివరికి వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరి రోజు సోమవారం ముందుగానే వచ్చి నామినేషన్ వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ఉత్తర తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో చివరి రోజు భారీగా నామినేషన్ దాఖలు కానున్నాయి. ఇప్పటివరకు గడిచిన ఐదు రోజుల్లో పట్టభద్రుల స్థానానికి 49 మంది, టీచర్ల స్థానానికి 9 మంది నామినేషన్ దాఖలు చేశారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్