రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా?

Best Web Hosting Provider In India 2024

రైతు స‌మ‌స్య‌ల‌పై సమీక్ష చేసే ఓపిక ప్రజాప్రతినిధులకు లేదా?

వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం

9 నెలలు తిరక్కుండానే 1.26 లక్షల కోట్ల అప్పు

మంగళవారం అప్పులవారంగా మార్చిన చంద్రబాబు

చివరకు మందుబాబులనూ మోసం చేసిన ఘనుడు

ముడుపుల కోసమే 14 శాతం మార్జిన్‌ పెంపు

వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు

అనంతపురం : ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ప్ర‌శ్నంచారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు చేసిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పండుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం శోచనీయమని తెలిపారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుని అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం గత ప్రభుత్వం, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ల పంపిణీ మాత్రమే చేస్తున్నారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం 1.50 లక్షల పింఛన్లకు కోత పెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 9 నెలలు కూడా కాకుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

పంటలకు గిట్టుబాటు ధర ఏదీ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం కష్టాలను పట్టించుకోవడం లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా మద్దతు ధర ప్రకటించినా క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. పంట అంతా దళారుల పాలవుతోందన్నారు. రైతులు శనగ విత్తనం వేసే సమయంలో క్వింటాల్‌ ధర రూ.7800 నుంచి రూ.8 వేలు ఉంటే ఈ రోజు రూ.5500కు పడిపోయిందన్నారు. ఇందులో కూడా రంగు మారిందని చెప్పి క్వింటాల్‌కు 10 నుంచి 15 కిలోలు ఉచితంగా ఇవ్వాలని అంటున్నారన్నారు. కందులు గత ఏడాది క్వింటాల్‌ రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికితే నేడు రూ.6300 నుంచి రూ.6400 ఉందన్నారు. కొర్రలు గత ఏడాది రూ.6 వేలు ఉంటే ఇప్పుడు రూ.2300 ఉందన్నారు. మొక్క జొన్న కూడా గత ఏడాది రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలికితే నేడు రూ.2 వేలు మాత్రమే ఉందన్నారు. ఇక వేరుశనత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 40 కేజీల బస్తా గత ఏడాది రూ.3600 నుంచి రూ.3800 ఉండేదని, కానీ నేడు రూ.2600కు పడిపోయిందన్నారు. పత్తి మద్దతు ధర రూ.7412 ఉంటే రూ.5500 కే అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. మిరప (క్వాలిటీ) గత ఏడాది రూ.40 వేల నుంచి రూ.41,500 ఉంటే నేడు రూ.7 వేల నుంచి రూ.9 వేలు పలుకుతోందని చెప్పారు. సాధారణ మిరప గతంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికితే నేడు కేవలం రూ.5500కు అమ్ముకుంటున్నారని అన్నారు. అరటి పంట పది రోజు క్రితం వరకు టన్ను రూ.30 వేలు ఉంటే నేడు రూ.23 వేలకు పలుకుతోందన్నారు. చీనీ రైతులు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. 10 టన్నులకు 2.5 టన్నులు సూట్‌ రూపంలో వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా అన్ని పంటల పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని.. హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పరిసర ప్రాంతాల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయన్నారు. అసలు భూగర్భ జలాలే ఇంకిపోతున్న తరుణంలో 9 గంటల ఉచిత విద్యుత్‌ వద్దే వద్దు అని రైతులు మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. ఫర్టిలైజర్స్, ఎరువుల దోపిడీ జరుగుతున్నా విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు గ్రామాల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. మరోవైపు మార్కెట్‌ యార్డుల్లో కమీషన్ల దందా సాగుతోందని మండిపడ్డారు. ప్రైవేట్‌ మార్కెట్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌లు కూడా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు.  

క్షేత్రస్థాయిలో వైపల్యాలు కన్పించడం లేదా?
క్షేత్రస్థాయిలో రైతాంగం పడుతున్న కష్టాలు ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు కన్పించడం లేదా? అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఖర్చు చేశాం.. ఇప్పుడు సంపాదించుకుంటాం అనే రీతిలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య కూడా ఎదురవుతోందని.. ఇప్పటికే శింగనమల, నార్పల, పామిడి వంటి మండలాల్లో నీటి ఇక్కట్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రైతు సమస్యలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  ప్రతి సోమవారం స్పందనలో ఇస్తున్న అర్జీలకు కూడా పరిష్కారం లభించడం లేదన్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఈర్వోలు నిర్లక్ష్యం వీడి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. 

మందుబాబులనూ మోసం చేసిన చంద్రబాబు
అలవికాని హామీలతో అన్ని వర్గాలను మోసం చేసినట్టే మందుబాబును కూడా చంద్రబాబు మోసం చేశారని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రైతులు పండిచిన పంటకు గిట్టుబాటు ధర లేదు గానీ, మద్యం అమ్ముకునే వాళ్లకు మాత్రం కమీషన్లు పెంచుతున్నారని విమర్శించారు. ఇదే సమయంలో మద్యం ధరలను కూడా పెంచారన్నారు. ఎన్నికలకు ముందు బహిరంగ సభల్లో నాణ్యమైన మద్యం ఇస్తాను..బాగా తాగండి అని ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటే అది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారంలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందన్నారు. అందుకే మార్జిన్‌ పెంచి దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. 14 శాతం మార్జిన్‌ పెంచడం వెనుక ప్రభుత్వ అధినేత, వ్యాపారస్తులకు మధ్య అగ్రిమెంట్‌ జరిగిందన్నారు.  మరోవైపు ఎక్కడ చూసినా బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయన్నారు. ఏపీలో మార్జిన్‌ పెంచి ముడుపులు తీసుకోవడంతో పాటు కర్ణాటక నుంచి మద్యం తెచ్చి బెల్ట్‌షాపులకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుంది.. లేదంటే ఇన్ని రంగులు మార్చలేనని పారిపోతుంది అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాబా స‌లాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెల వేణు, జేసీఎస్‌ జిల్లా కన్వీనర్‌ శివారెడ్డి పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024