Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/illu_illalu_1739331456371_1739331462376.jpg)
Illu Illalu Pillalu February 12th Episode: ప్రేమను నడిరోడ్డుపై వదిలేసిన ధీరజ్ – చందుకు పెళ్లి సంబంధం తెచ్చిన నర్మద
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో వేదావతి మాట కాదనలేక ప్రేమను కాలేజీకి తన బైక్‌పై తీసుకోవడానికి ధీరజ్ ఒప్పుకుంటాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లగానే ప్రేమను దారిలోనే వదిలేసి వెళ్లిపోతాడు. చందు పెళ్లికి ధీరజ్, సాగర్ అడ్డుగా మారారని రామరాజు బాధపడతాడు.
ధీరజ్, ప్రేమ ఒకే బైక్‌పై కాలేజీకి వెళ్లేలా నర్మదనే ప్లాన్ చేస్తుంది. కోపతాపాలు పోయి ఇద్దరు మధ్య ఈ విధంగానైనా చనువు పెరుగుతుందని వేదావతికి సలహా ఇస్తుంది నర్మద. కోడలు ఇచ్చిన సలహాకు వేదావతి ఫిదా అవుతుంది. ప్రేమను కాలేజీకి బైక్ తీసుకువెళ్లమని ధీరజ్‌కు చెబుతుంది వేదావతి. అందుకు ధీరజ్ ఒప్పుకోడు. ప్రేమ కూడా ధీరజ్ బైక్‌పై వెళ్లడానికి సందేహిస్తుంది. కానీ వేదావతి మాట కాదనలేక ఇద్దరు అయిష్టంగానే అంగీకరిస్తారు.
ఒకే బైక్‌పై కాలేజీకి…
ధీరజ్, ప్రేమ ఒకే బైక్‌పై కాలేజీకి బయలుదేరుతారు. ఇద్దరు జంటగా మొదటిసారి కాలేజీకి వెళుతుండటంతో దిష్టి తీస్తుంది వేదావతి. ధీరజ్ బైక్‌పై ప్రేమ ఎక్కడం భద్రావతి, సేనాపతి చూస్తారు. కోపంతో రగిలిపోతారు.
తండ్రితో పాటు భద్రావతిని చూడగానే భయంతో బైక్ దిగిపోతుంది ప్రేమ. వేదావతి ఆమెను బైక్‌పై కూర్చొబెడుతుంది. ఇద్దరు ఆనందంగా, జాగ్రత్తగా కాలేజీకి వెళ్లమని చెబుతుంది. దగ్గరుండి సాగనంపుతుంది. ఆ సీన్ చూసి సహించలేకపోతాడు విశ్వ.
నేను ఏమైనా డ్రైవర్‌నా…
ఇంటి నుంచి కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ ఆపేసిన ధీరజ్…ప్రేమను దిగమని అంటాడు. నిన్ను కాలేజీకి తీసుకెళ్లి ఇంటికి తీసుకురావడానికి నేను ఏమైనా డ్రైవర్‌నా…నువ్వు దొరసానిలా కూర్చుంటే నేను డ్రైవ్ చేయలా అంటూ గొడవకు దిగుతాడు.
నీతో కలిసి బైక్ కూర్చున్న ఐదు నిమిషాలు తేళ్లు జెర్రులు పాకినట్లుగా అనిపించిందని, కాళ్లు పట్టుకొని బతిమిలాడిన మళ్లీ నీ బైక్ ఎక్కనని ప్రేమ అంటుంది. అసలు నీ బండి ఎవరు ఎక్కుతాడురా ఛీ ఛీ అని భర్తను ఈసడించుకుంటుంది. ప్రేమను రోడ్డుపైనే వదిలేసి ధీరజ్ వెళ్లిపోతాడు. సచ్చినోడు మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని ధీరజ్‌ను తిట్టుకుంటూ బస్‌స్టాప్‌కు వస్తుంది.
నర్మద షాక్…
బస్‌స్టాప్‌లో ప్రేమను చూసి నర్మద షాకవుతుంది. ధీరజ్ బైక్‌పై కాలేజీకి ఎందుకు వెళ్లలేదని అడుగుతుంది. ధీరజ్ తనను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడని బదులిస్తుంది ప్రేమ. ప్రతి చిన్న విషయానికే మీరు ఇలా కొట్టుకుంటే ఎలా అని నర్మద అంటుంది. మీరు ఎప్పుడు కలిసిపోతారో అని అంటుంది.
నర్మద కన్నీళ్లు…
నర్మద, ప్రేమ మాట్లాడుకుంటూ వెళుతుండగా నర్మద తల్లి సుజాత కనిపిస్తుంది. తల్లిని చూడగానే ఆనందంతో పలకరిస్తుంది నర్మద. రైస్ మిల్లులో మూటలు మోసేవాడితో లేచిపోయి నువ్వు చేసిన పరువు తక్కువ పనికి ఇంకా బతికే ఉన్నామని, ఎవరికి ముఖం చూపించలేక ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నామని సుజాత అంటుంది. కూతురితో మాట్లాడటానికి ఇష్టపడదు. నువ్వు మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావని, ఇంకోసారి మాతో మాట్లాడొద్దని అంటుంది.
కన్నవాళ్లు మాట్లాడే ప్రతి మాట బాధతోనే కానీ కోపంతో కాదని, వాళ్లు అర్థం చేసుకునే రోజు వస్తుందని నర్మదకు ప్రేమ సర్ధిచెబుతుంది. అప్పుడే సేనాపతి అక్కడికి వస్తాడు.
సేనాపతి ఎంట్రీ…
తండ్రిని చూపి ప్రేమ ఎమోషనల్ అవుతుంది. నాన్నా అని పిలుస్తుంది. ప్రేమ ఎన్నిసార్లు పిలిచినా సేనాపతి వినిపించుకోనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రేమను నర్మద ఓదార్చుతుంది. నాన్నకు నేనంటే ప్రాణమని కానీ ఆయన ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోతుంటే ప్రాణం పోతున్నట్లుగా బాధగా ఉందని ప్రేమ అంటుంది.
ఒకే రకమైన బాధ…
ఇద్దరం మనసులో ఒకే రకమైన బాధను మోస్తున్నామని, కన్నవాళ్ల తో చెప్పలేనంత ప్రేమ, బోలెడు జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఆ ప్రేమ, జ్ఞాపకాలు ఒకేసారి దూరమై ద్వేషంగా మారి..కన్నవాళ్లు మనతో మాట్లాడకపోతే ఆ నరకాన్ని మోయడం అంత తేలిక కాదని నర్మద అంటుంది. ఏదో ఒక రోజు కన్నవాళ్ల ప్రేమను పొందేలా దేవుడు చేస్తాడు, ఈ బాధను సంతోషంగా మర్చుతాడు. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుందామని ప్రేమకు సర్ధిచెబుతుంది నర్మద.
రామరాజు ఆవేదన…
పిల్లల పెంపకం, ప్రవర్తన సరిగ్గా లేదని చందు పెళ్లి చూపుల్లో తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి రామరాజు బాధపడతాడు. బావ కళ్లల్లో నీళ్లు చూసి తిరుపతి షాకవుతాడు. చందు పెళ్లవుతుందో లేదో అని భయపడుతున్నానని రామరాజు అంటాడు. మీ ఇద్దరు కొడుకులు లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నారటగా అని అంటే చందుకు పెళ్లి ఎలా జరుగుతుందని తిరుపతితో తన మనసులోని బాధను పంచుకుంటాడు రామరాజు.
చందుకు తమ్ముళ్లు శాపంగా మారిపోయారని ఆవేదనకు లోనవుతాడు. ధీరజ్, సాగర్ వాళ్ల పెళ్లిళ్లు వాళ్లు చేసుకొని, తమ జీవితం తాము చూసుకున్నారని, కానీ చందు మాత్రం తన కోసం ప్రేమను త్యాగం చేశాడని రామరాజు అంటాడు. ఓ మంచి అమ్మాయిని చూసి చందుకు పెళ్లి చేసుకోకపోతే తండ్రిగా తాను ఓడిపోయినట్లేనని రామరాజు ఎమోషనల్ అవుతాడు.
చందు పెళ్లికి ఆటంకం…
చందుకు తప్పకుండా పెళ్లి జరుగుతుందని, మా అమ్మాయిని చేసుకోండని అందరూ వెంటపడతారని రామరాజుకు తిరుపతి సర్ధిచెబుతాడు. ధీరజ్, సాగర్ పెళ్లి చందు పెళ్లికి ఎక్కడ ఆటంకంగా మారుతుందోనని రామరాజు భయపడతాడు.
నర్మద హ్యాపీ..
నర్మద ఆఫీస్‌లో అడుగుపెట్టగానే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతారు. అత్తమామలు దేవుళ్లు అని, కన్న ప్రేమను మరిపిస్తున్నారని నర్మద పొంగిపోతుంది. చందు పెళ్లి గురించి తన స్నేహితురాలికి చెప్పి బాధపడుతుంది నర్మద. తమ పిన్ని కూతురు పెళ్లికి సిద్ధంగా ఉందని, మీరు ఓకే అంటే నేను మాట్లాడుతానని నర్మద ఫ్రెండ్ చెబుతుంది. ఆ మాట వినగానే సర్మద సంతోషపడుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.