



Best Web Hosting Provider In India 2024

Gangula Kamalakar : సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బయటపెట్టండి, మళ్లీ రీసర్వే చేయాల్సిందే- గంగుల కమలాకర్ డిమాండ్
Gangula Kamalakar : కాంగ్రెస్ కులగణన పేరిట బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ కాదు…చట్టబద్దతతో కూడిన రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు.
Gangula Kamalakar : కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ కాదు…చట్టబద్దతతో కూడిన రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ గత 15 ఏళ్ళ జనాభా లెక్కలను ఆధారాలతో చూపించారు. తెలంగాణలో నాలుగు కోట్ల 20 లక్షలకు పైగా జనాభా ఉంటే మూడు కోట్ల 70 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందని, అందులో బీసీలను తగ్గించి కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు.
జనాభాను తగ్గించడమే కాదు బీసీలను చంపేసిందని విమర్శించారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలో తెలంగాణలో మూడు కోట్ల 35 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించిందని, 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే మూడు కోట్ల 35 లక్షల మంది ఉంటే 18 సంవత్సరాల లోబడి ఉన్న విద్యార్థులు 60 లక్షల మంది ఉన్నారని అధికారుల లెక్కలే చెబుతున్నాయని తెలిపారు.
పిల్లలు వయోజనులు కలిపితేనే మూడు కోట్ల 95 లక్షల మంది ఉంటే ఇక ఓటర్లుగా నమోదు కానివారు బడికెళ్లని పిల్లలు రెండు నుంచి మూడు శాతం ఉంటారని ఈ లెక్కన చూస్తే నాలుగు కోట్ల పైన జనాభా ఉంటే ప్రభుత్వం మూడు కోట్ల 54 లక్షలు ఉన్నట్లు చూపడం మిగతా వారిని ఖతం చేయడమేనని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేయడమే కాదు అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ కాకీ లెక్కలు
కాకి లెక్కలతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని గంగుల కమలాకర్ ఆరోపించారు. కులగణనపై చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదా కులాల వారీగా గ్రామాలలో ఓటర్ జాబితా మాదిరిగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ కులాల వారీగా రీ సర్వే చేయాలన్నారు. గత సర్వేలో మిస్ అయిన వారినే కాకుండా అందరి వివరాలు కులాల వారీగా సేకరించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బీసీల జనాభా 52 నుంచి 54 శాతం ఉంటుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని లేనిచో ఊర్కునే ప్రసక్తే లేదని గంగుల కమలాకర్ హెచ్చరించారు.
బిఆర్ఎస్ లో బిసిల స్థానం అంతర్గతం…
బీసీ నినాదాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమైన బిఆర్ఎస్, ఆ పార్టీలో బీసీల స్థానం ఏంటని మీడియా ప్రశ్నిస్తే గంగుల కమలాకర్ డొంక తిరుగుడు సమాధానం చెప్పారు. పార్టీలో బీసీల స్థానంపై సూటిగా సమాధానం చెప్పకుండా పార్టీలో బీసీల అంశం అంతర్గత వ్యవహారమని దాటవేశారు. రాజకీయంగా పార్టీలో రిజర్వేషన్ కాదని, చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్ కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బీసీలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా ఉద్యమిస్తామని చెప్పారు.
పంటలు ఎండకుండా కాపాడండి….
సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా డి83, డి86 ద్వారా చొప్పదండి నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే సాగు నీటిని తక్కువ వదులుతూ చివరి ఆయకట్టుకు నీరందకుండా చేస్తున్నారని విమర్శించారు. చొప్పదండి ధర్మపురి పెద్దపల్లి వైపు భారీగా నీటిని వదులుతూ తమకు నీళ్లు రాకుండా చేస్తు వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. నీటి విడుదలలో రాజకీయం చేయకుండా రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్