



Best Web Hosting Provider In India 2024

Online Games : ఆన్ లైన్ గేమ్ తో అప్పులపాలు, ఇద్దరు యువకులు ఆత్మహత్య
Online Games : ఆన్ లైన్ గేమ్ లు ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. వ్యసనంగా మారిన గేమ్ లతో అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.
Online Games : ఆన్ లైన్ గేమ్స్, ఫోన్ యాప్ లోన్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన కొందరు వాటికి బానిసై తమ బతుకులను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆన్ లైన్ గేమ్స్ బానిసలుగా మారి ఆర్థికంగా చితికిపోయారు. వారిపై ఆధారపడ్డ వారి బతుకులను ఆగం చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన మధు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ లో రమ్మీతో పాటు బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో గతంలో ఒకసారి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య ఓ కూతురు ఉన్న మధుకు ఆన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారడంతో గేమ్స్ ఆడకుంటే బతకలేనన్నట్లుగా స్థాయికి చేరాడు. సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆన్లైన్ గేమ్ తో మధు ప్రాణాలు కోల్పోగా ఆయనపై ఆధారపడ్డ కుటుంబం దిక్కులేని వారిలా మారారు.
పెద్దపల్లి జిల్లాలో
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిని యైటింక్లయిన్ కాలనీకి చెందిన చొప్పరి దేవేందర్ (35) ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. కార్లను అద్దెకు నడుపుతుండటమే కాకుండా, జూలపల్లిలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడ్డ దేవేందర్ రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. దానికితోడు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన దేవేందర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు కరీంనగర్ కు రిఫర్ చేయగా తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
కారు అమ్మినా తీరని అప్పులు
ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ దేవేందర్ రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తన వద్ద ఉన్న కారును అమ్మేశాడని, అయినా అప్పులు తీరక ఆన్ లైన్ గేమ్ వ్యసనం నుంచి బయటపడలేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్