



Best Web Hosting Provider In India 2024

GBS Cases In AP : జీబీఎస్ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి, ఏపీలో తొలి మరణం
GBS Cases In AP : ఏపీలో గులియన్-బారీ సిండ్రోమ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ జీబీఎస్ వ్యాధితో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది.
GBS Cases In AP : ఏపీలో గులియన్-బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్‌తో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మృతిచెందారు. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ధ్రువీకరించారు. చాలా అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఇటీవల ఏపీలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
రాష్ట్రంలో 7 కేసులు
గుంటూరు జీజీహెచ్ లో ఈ నెల 11న ఒక్కరోజే ఏడు జీబీఎస్ కేసులు వచ్చాయి. ప్రకాశం, ఏలూరు, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో కాకినాడలోని ఆసుపత్రిలో ఇద్దరు చేరారు. ప్రస్తుతం ఈ వ్యాధి లక్షణాలతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 17 మంది చికిత్స పొందుతున్నారు.
అంటు వ్యాధి కాదు
జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినా, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు సూచిస్తుంది. ఈ వ్యాధి ఒకరకంగా పక్షవాతం లాంటిదేనని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధి చాలా వరకు ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చిన వారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకుంటే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని నశింపజేస్తుందని చెప్పారు.
వ్యాధి లక్షణాలు
ముఖ్యంగా పెద్ద వారికి సంక్రమించే ఈ వ్యాధి, ఇప్పుడు పిల్లలకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కండరాల బలహీనత, తిమ్మిరి, నడవడానికి ఇబ్బంది పడడం, శ్వాస ఆడకపోవటం వ్యాధి లక్షణాలు అని వైద్యులు చెప్తున్నారు. గులియన్-బారీ సిండ్రోమ్ గురించి ఆందోళన వద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. జీబీఎస్ కేసులపై నిరంతం సమీక్షిస్తున్నామన్నారు. జీబీఎస్ గురించి అనవసర ఆందోళన వద్దని వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్