



Best Web Hosting Provider In India 2024

Dhanraj Interview: కమెడియన్.. హీరోగా నటిస్తే సినిమా చూస్తారా అన్నారు – ధన్‌రాజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Dhanraj Interview: టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ రామం రాఘవం మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో సముద్రఖనితో పాటు ధన్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.
Dhanraj Interview: సుదీర్ఘ సినీ ప్రయాణంలో కమెడియన్‌గా సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్దస్థ్‌తో పాటు పలు కామెడీ షోస్ చేశాడు. కమెడియన్‌గా తనను తాను నిరూపించుకున్న ధన్‌రాజ్ రామం రాఘవం మూవీతో డైరెక్టర్‌గా మారుతున్నాడు. సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ ధన్‌రాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఫిబ్రవరి 21న ఈ మూవీప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామం రాఘవం విశేషాలతో పాటు తన సినీ జర్నీ గురించి ధన్‌రాజ్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సంగతులు ఇవే…
మాటలు రాకుండా…
యాక్టర్‌గా ఇప్పటివరకు 90 సినిమాల వరకు చేశా. రామం రాఘవం మూవీతో ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతోన్న ఫీలింగ్ కలుగుతోంది. నీకు డైరెక్షన్ అవసరమా? కమెడియన్‌గా బాగానే సినిమాలు చేసుకుంటున్నావుగా అనే మాటలు రాకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. రామం రాఘవం కోసం పదిహేను నెలలు పైనే స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు చేశాం.
కంటెంట్ ఈజ్ కింగ్…
బలగం మూవీతో కమెడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ మూవీస్ చేయగలరని వేణు నిరూపించాడు. డైరెక్టర్స్ కావాలనే కమెడియన్లకు ఓ దారి చూపించాడు. వేణుతో పోటీపడాలనో, అతడి కంటే పెద్ద హిట్ కొట్టాలనే ఆలోచనతో కాకుండా మంచి కథను ఆడియెన్స్‌కు చెప్పాలనే రామం రాఘవ మూవీ చేశాం.
ధన్‌రాజ్ హీరో ఏంటి?
ధన్‌రాజ్ లాంటి కమెడియన్‌ను హీరోగా పెట్టుకొని సినిమా తీయడం ఏంటి? సముద్రఖని కొడుకుగా ధన్‌రాజ్ నటిస్తే ఆడియెన్స్ సినిమా చూస్తారా అంటూ మా ప్రొడ్యూసర్‌కు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను చేసిన రాఘవ క్యారెక్టర్‌కు స్టార్ అవసరం లేదు. ఇమేజ్ లేని నటుడైతేనే పాత్రకు న్యాయం జరుగుతుందని అనిపించింది. . రామం రాఘవం సినిమాలోకి నేను ఆర్టిస్ట్‌గానే ఎంటర్ అయ్యా. మరో దర్శకుడు ఈ సినిమా చేయాల్సింది. నిర్మాతలతో వచ్చిన అభిప్రాయభేదాల వల్ల డైరెక్టర్ తప్పుకోవడంతో నేను ఈ బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది.
కొత్త పాయింట్….
తండ్రీకొడుకుల అనుబంధంతో పాటు ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ రామం రాఘవం మూవీ ఉంటుంది. . ఇలాంటి బాధ మన శత్రువుకు కూడా రావొద్దని ఆడియెన్స్ అనుకునేలా చివరి ఇరవై నిమిషాలు సినిమా సాగుతుంది. క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
లిమిట్స్‌లోనే చేశాం…
నేను ఎలా స్క్రీన్‌పై కనిపించాలి, నన్ను ఆడియెన్స్ ఎలా చూస్తారన్నది క్లారిటీ ఉంది. ఆ లిమిట్స్ దాటకుండా సినిమా చేశాం. ఫైట్లు, డ్యూయెట్స్ ఉండవు. కథకు సంబంధం లేని కామెడీ ఈ మూవీలో కనిపించదు. కెరీర్‌లో మంచి సినిమా చేశానని చెప్పుకునేలా రామం రాఘవం ఉంటుంది.
డబ్బు కోసం ఆలోచించలేదు…
రామం రాఘవం సినిమా చేస్తోన్నప్పుడు యాక్టర్‌గా ఇతర సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. వేరే సినిమాల్లో చేసే కామెడీ పాత్రల ప్రభావం ఈ మూవీపై పడకుండా కావాలనే యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చా. డబ్బుల కోసం ఆలోచించలేదు.
నటుడిగా నాకంటూ ఎలాంటి ఇమేజ్ లేదు. పిల్ల జమీందార్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో ఎమోషన్స్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా అభిమతం. కొన్ని సర్‌ప్రైజ్ మూవ్‌మెంట్స్ ఉంటేనే నటులకు తృప్టి ఉంటుంది.
జోక్యం చేసుకోలేదు
విమానం సెట్స్‌లో ఉండగా రామం రాఘవం కథను సముద్రఖనికి వినిపించా. ఐదు నిమిషాలు కథ వినగానే సినిమా చేస్తానని అన్నారు. సముద్రఖని స్వతహాగా డైరెక్టర్ అయినా నా పనిలో ఏ రోజు జోక్యం చేసుకోలేదు. నీకు సలహాలు ఇస్తానని అనుకోవద్దని ముందే చెప్పారు. నేను అదే కోరుకున్నా. నాకున్న అనుభవంతో సెట్స్‌లో డైరెక్టర్ల పనితీరు నుంచి నేర్చుకున్నా. ఆ అనుభవం ఈ సినిమాలో ఉపయోగపడింది.
ఈ సినిమాలోని ఓ మెయిన్ క్యారెక్టర్ కోసం డేనియల్ బాలాజీని అనుకున్నాం. కథ విని ఫ్రీగా సినిమా చేస్తానని అన్నాడు. కానీ సినిమా ఒప్పుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు. డేనియల్ బాలాజీ క్యారెక్టర్‌ను హరీస్ ఉత్తమన్ చేశాడు. పిల్ల జమీందార్ అశోక్ దర్శకత్వంలో వస్తోన్న బాలీవుడ్ మూవీలో నటిస్తోన్నా.
సంబంధిత కథనం