



Best Web Hosting Provider In India 2024

Uttarandhra Mlc Election : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ? పది ముఖ్యమైన అంశాలు
Uttarandhra Mlc Election : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మూడు బలమైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ చెరో అభ్యర్థికి మద్దతు తెలపడంతో రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయంపై విమర్శలు వస్తున్నాయి.
Uttarandhra Mlc Election : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎవరి ప్రభావం ఎంత అనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. మూడు బలమైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా జరుగుతున్న ఈ ఎన్నికల పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈనెల 27 పోలింగ్ జరగనుంది. మార్చి 3 ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పది ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.
1. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 13,503 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ అధ్యపకులు, ప్రైవేట్ కాలేజీ, హైస్కూల్స్‌లో టీచర్లు తదితరులు ఓటర్లుగా ఉంటారు.
2. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్), పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), గాదె శ్రీనివాసుల నాయుడు (పీఆర్‌టీయూ)లు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కోసూరు రాధాకృష్ణ, నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, సత్తలూరి పద్మావతి, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు, పోతుల దుర్గా ప్రసాద్‌లు బరిలో ఉన్నారు. అయితే పది మందిలో పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్), పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), గాదె శ్రీనివాసులనాయుడు (పీఆర్‌టీయూ) మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.
3. ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మను ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బలపరిచింది. అయితే గత ఎన్నికల్లో ఈయనకు యూటీఎఫ్ మద్దతు ఇచ్చింది. అందువల్లనే ఈయన గెలుపు తథ్యం అయింది. అయితే ఈసారి యూటీఎఫ్ తన అభ్యర్థిని బరిలోకి పెట్టింది. దీంతో పాకలపాటి రఘువర్మ గెలుపు అంతా ఈజీ కాదనేది స్పష్టంగా కనబడుతోంది. అయితే ఈయనకు టీడీపీ మద్దతు ఇస్తోంది.
4. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడును పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం బలపరిచింది. ఈయన గతసారి ఒక్కసారే ఓటమి చెందారు. అంతకుముందు రెండు సార్లు వరుసగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈయన మొన్నటి వరకు టీడీపీకి దగ్గరగా ఉండేవారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇవ్వడంతో ఈయన కాస్తా దూరంగా ఉన్నారు. అయితే గాదె శ్రీనివాసుల నాయుడికి బీజేపీ మద్దతు ప్రకటించింది.
5. పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయగౌరిని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బలపరిచింది. అయితే ఈమె బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇటీవలి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ఈమె ఎన్నికల బరిలోకి దిగారు. అయితే యూటీఎఫ్ సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఉపాధ్యాయ వర్గంలో ఈమెకు ఆదరణ ఎక్కువగానే ఉంది. అయితే ఈ స్థానం నుంచి యూటీఎఫ్ ఒక్కసారి కూడా గెలవలేదు. కాకపోతే గత ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతుతో పాకలపాటి రఘువర్మ గెలుపొందారు.
6. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలేవీ బరిలో లేవు. కాకపోతే టీడీపీ, బీజేపీలు మాత్రం చెరొ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. దీంతో కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మరోవైపు కూటమిలో భాగస్వామ్యం అయిన జనసేన, ప్రధాన ప్రతిపక్షం పార్టీ వైసీపీ ఇప్పటి వరకు ఎవరికి మద్దతు ప్రకటించలేదు. ఈ రెండు పార్టీల మద్ధతుపై కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది.
7. రాష్ట్రంలోని కూటమిలో టీడీపీ, బీజేపీ చెరో దారిలో ఉండటంతో ఏం చేయాలో జనసేనకు అర్థం కావడం లేదు. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి మద్దతు ఇద్దామంటే, బీజేపీ వాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. పోనీ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి మద్దతు ఇద్దామంటే, టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. దీంతో జనసేన పరిస్థతి ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్న చందంగా మారింది.
8. ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా టీడీపీ, బీజేపీ తమ రాజకీయాలతో కలుషితం చేస్తోన్నాయని ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఎందుకంటే ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. కానీ టీడీపీ, బీజేపీ చెరో అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగడంతో రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇస్తూ మీడియాతో మాట్లాడేటప్పుడు కూటమి పార్టీలన్నీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయని ప్రకటించారు.
9. దీన్ని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ ఖండించారు. తమ మద్దతు గాదె శ్రీనివాసుల నాయుడికి ఇస్తున్నామని, తమ పార్టీ మద్దతు కూడా రాఘువర్మకే ప్రకటించడానికి ఆయనెవరూ? అని ప్రశ్నించారు. గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపునకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలని బీజేపీ నేత మాధవ్ పిలుపు ఇచ్చారు. అంతేకాదు, గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపు కోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని ప్రకటించారు.
10. దీంతో రాజకీయ విమర్శలు చర్చకు వచ్చి, ఉపాధ్యాయ సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సంబంధమేంటనీ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తోన్నారు. ఇలా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయాలు ఉన్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్