


Best Web Hosting Provider In India 2024
New Delhi CM: ఈ నెల 20న ఘనంగా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం; హాజరు కానున్న బీజేపీ దిగ్గజ నేతలు
New Delhi CM: ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ తరఫున కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకు ఫిబ్రవరి 19న తెర పడనుంది. ఫిబ్రవరి 20న ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది.
New Delhi CM: తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రం బీజేపీ నేతలెవరూ పెదవి విప్పడం లేదు.
27 ఏళ్ల తరువాత..
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తోంది. అందువల్ల, బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. అందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1975లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో తొలి మెగా నిరసన జరిగిన చారిత్రక రామ్ లీలా మైదానంలోనే కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ బీజేపీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్ దేవా తెలిపారు. ఫిబ్రవరి 20 సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో పార్టీ విజయం సాధించడంతో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బీజేపీ నేత ఒకరు తెలిపారు.
నెక్స్ట్ సీఎం ఎవరు?
కాగా, ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరని నిర్ణయించిందనే విషయంలో మాత్రం బీజేపీ నేతలెవరూ గుట్టు విప్పడం లేదు. బీజేపీ అగ్ర నేతలు కూడా ఈ విషయంలో రహస్యంగా ఉన్నారు. అయితే, ఈ నెల 19న జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉందని, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభాపక్ష నేతతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు రాజ్ నివాస్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతారని బీజేపీ నేతలు తెలిపారు.
సీఎం రేసులో వీరే..
న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా, రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, ఘోండా ఎమ్మెల్యే అజయ్ మహావర్ తదితరులు సీఎం రేసులో ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో జాట్, దళిత, పూర్వాంచలి, సిక్కు, ఉత్తరాఖండ్ వలసదారులు, బనియాలకు ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందని బిజెపి నాయకులు తెలిపారు.
అతిధుల జాబితాలో..
అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్ష పార్టీల ఎంపీలు ఉన్నారు. వీరుకాకుండా, దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, టెక్నోక్రాట్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుల ప్రదర్శనలను ప్లాన్ చేస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు తెలిపారు.
రామ్ లీలా మైదానంలో..
సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావల్సిన ఏర్పాట్లు బీజేపీ నేతలు చేస్తున్నారు. రామ్ లీలా మైదాన్ ప్రహరీ గోడలకు తాజాగా పెయింట్ వేయడం, విశాలమైన మైదానాన్ని, దాని చుట్టూ ఉన్న ఫుట్ పాత్ లు, రోడ్లను శుభ్రం చేయడం చేస్తున్నారు. అతిథులు, పార్టీ మద్దతుదారులు బస చేయడానికి టెంట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీనియర్ నేతలు తరుణ్ చుగ్, వినోద్ తావ్డేలను సమన్వయకర్తలుగా నియమించారు.
బీజేపీ ఘన విజయం
ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ నోరు మెదపడం లేదు. అయితే బుధవారం శాసనసభాపక్ష సమావేశంతో ఆ ఊహాగానాలకు తెరపడనుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో చర్చలు జరిపేందుకు బిజెపి ఇంకా పరిశీలకులను నియమించలేదు. బుధవారం జరిగే శాసనసభాపక్ష సమావేశానికి ముందు పరిశీలకులు ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీజేపీ నేత చెప్పారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link