



Best Web Hosting Provider In India 2024

Guntur Crime : డబ్బులివ్వు… లేకపోతే మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తా! ఇంజినీరింగ్ విద్యార్థినికి బెదిరింపులు
ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని మరో విద్యార్థి బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానని వేధించాడు. బాధిత యువతి గుంటూరు అరండల్‌పేట్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు… నిందితుడితో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. డబ్బులివ్వాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఇంజినీరింగ్ విద్యార్థినిని మరో ఇంజినీరింగ్ విద్యార్థి బెదిరించాడు. సదరు ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
సోషల్ మీడియాలో పరిచయం…!
గుంటూరు అరండల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆ విద్యార్థినికి గత కొంత కాలం క్రితం సోషల్ మీడియా వేదికగా మరో ఇంజినీరింగ్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ…. ఆ తరువాత వీరిద్దరూ మాట్లాడుకోవటం లేదు. దీంతో విద్యార్థినిపై సదరు యువకుడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు తరచూ ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులు….
ఆ విద్యార్థినికి తన స్నేహితులతో కూడా ఫోన్ చేయించేవాడు. తాను చేసిన ఫోన్‌కు స్పందించడం లేదని కోపం పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి…. ఆమెకు మెసేజ్‌లు చేశాడు. ఫోటోలను మార్ఫింగ్(నగ్నంగా) చేస్తానని, సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అయితే అలా చేయకుండా ఉండాలంటే… తాను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఇలా తరచూ వేధింపులు… బెదిరింపులతో విసుగు చెందిన ఆ ఇంజినీరింగ్ యువతి…. గుంటూరు అరండల్ పేట పోలీసులను ఆశ్రయించింది.
అడ్డంగా దొరికిపోయారు….
ఫిర్యాదు అందుకున్న పోలీసులు… చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవాలని నిర్ణయించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం…. ఇంజినీరింగ్ విద్యార్థినితో నిందితుడికి ఫోన్ చేయించారు. ఓ ప్రాంతంలో రూ.15 వేలు పెడతానని… వచ్చి తీసుకెళ్లంటూ ఆమె చేత చెప్పించారు. దీంతో డబ్బులు తీసుకోవడానికి ఆ ప్రాంతానికి ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు ఆతనికి సహకారంగా మరో ముగ్గురు వెళ్లారు. డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు దాడి చేశారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీసులు నలుగురిని విచారిస్తున్నారు. ఎందుకు వేధింపులకు దిగాడు…? అలాగే మిగిలిన వారి పాత్ర వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత… వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్