Champions Trophy 2025 Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ఆరంభం.. తొలి మ్యాచ్‍కు పాక్ రెడీ.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

Best Web Hosting Provider In India 2024


Champions Trophy 2025 Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ఆరంభం.. తొలి మ్యాచ్‍కు పాక్ రెడీ.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2025 10:22 AM IST

Champions Trophy 2025 – PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ నేడు మొదలుకానుంది. తొలి పోరులో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ (REUTERS)

ఎనిమిదేళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ వచ్చేసింది. ఈ క్రికెట్ సమరానికి వేళయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేడు (ఫిబ్రవరి 19) మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా టోర్నీ సాగనుంది. భారత్ ఆడే మ్యాచ్‍లు దుబాయ్‍లో జరుగుతాయి. మిగిలిన మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు తొలి మ్యాచ్‍లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.

కరాచీ వేదికగా..

కరాచీలోని నేషనల్ స్టేడియంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ తొలి మ్యాచ్‍లో న్యూజిలాండ్‍తో ఆతిథ్య పాక్ తలపడనుంది. ఏర్పాట్లు ఆలస్యం అవుతుండతంతో ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగలదా అనే సందేహాలు ఓ దశలో ఏర్పడ్డాయి. అయితే ఏదో విధంగా ఏర్పాట్లు పూర్తి చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఈ మ్యాచ్‍పై మరింత ఆసక్తి ఉంది. సొంతగడ్డపై చాలా ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ జరుగుతుండటంతో సత్తాచాటాలని తహతహలాడుతోంది మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాక్.

టైమ్, లైవ్ వివరాలు

పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నేడు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలుకానుంది. ఇండియాలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే.. జియో హాట్‍స్టార్ (డిస్నీప్లస్ హాట్‍స్టార్)లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

తుది జట్లు ఇలా..!

గత ముక్కోణపు సిరీస్‍కు గాయం వల్ల దూరమైన స్టార్ పేసర్ హరిస్ రావూఫ్ సిద్ధమవడం పాకిస్థాన్‍కు కలిసొచ్చే అంశం. మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలో పాక్ బరిలోకి దిగుతోంది.

పాకిస్థాన్ తుదిజట్టు (అంచనా): బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయబ్ తాహిర్, ఖుష్‍దిల్ షా, షాహిన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహమ్మద్, హరీస్ రవూఫ్.

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి తలకు తగలడంతో ముక్కోణపు సిరీస్‍లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. అయితే, అతడు కూడా పూర్తిగా కోలుకున్నాడు.

న్యూజిలాండ్ తుదిజట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, విల్, ఔ రౌర్కీ

భారత్ పోరు రేపు

ఛాంపియన్స్ ట్రోఫీలో తన పోరును రేపు (ఫిబ్రవరి 20) భారత్ మొదలుపెట్టనుంది. బంగ్లాదేశ్‍తో దుబాయ్ వేదికగా రేపు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‍తో తలపడనుంది.

గ్రూప్స్ ఇలా..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనిమిది జట్లు తలపడుతుండగా.. రెండు గ్రూప్‍లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‍లు ఆడుతుంది. రెండో గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ ఆడతాయి. సెమీస్ గెలిచిన రెండు జట్లు ఫైనల్‍లో తలపడతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link