



Best Web Hosting Provider In India 2024

Bird Flu Animals: బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లకే కాదు ఈ జంతువులకు కూడా వస్తాయి, వీటికి దూరంగా ఉండాల్సిందే
Bird Flu Animals: బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పుడు ఎన్నో కోళ్లు మరణిస్తున్నాయి. అందుకే చికెన్ని కూడా తినవద్దని చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కేవలం కోళ్లకే కాదు ఇతర జంతువులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.
బర్డ్ ఫ్లూ బారిన పడి లక్షలాదిగా కోళ్ళు మరణిస్తున్నాయి. బర్డ్ ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లయేంజా వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది నేరుగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడి చేస్తుంది. అయితే కేవలం కోళ్లకే కాదు ఇతర జంతువులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇప్పుడు ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా ఎన్నో పక్షులను, జీవులను పెంచుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా వ్యాపిస్తున్న కాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలోని ఆరు జిల్లాల్లో వేలాది కోళ్లను చంపేశారు. గుడ్లను నాశనం చేశారు. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్ల ఫామ్‌లకే పరిమితం అవుతుందని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి కోళ్ళకే కాదు ఇంకా ఎన్నో జంతువులకు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇన్ఫెక్షన్ నివారించడానికి లక్షన్నరకు పైగా కోళ్లను చంపినట్టు తెలుస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కేవలం కోళ్లే కాదు, ఇతర పక్షులు జంతువులు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి.
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?
ఇది ఇన్ఫ్లయేంజా వైరస్ వల్ల కలిగే ఒక ప్రమాదకరమైన వ్యాధి. పక్షులు, జంతువులను అధికంగా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు జంతువుల నుండి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.
బర్డ్ ఫ్లూ ఏ జీవులకు సోకుతుంది?
బర్డ్ ఫ్లూ కేవలం కోళ్ళకే కాదు… పిల్లులు, కుక్కలు, పాడి జంతువులైన ఆవులు, గేదెలు, అలాగే బాతులు, హంసలు, పావురాలు, చిలుకలు, పందులు, కొంగలకు కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి కేవలం కోళ్ళకు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతుంది అనుకోవద్దు. మీ ఇంట్లో పిల్లులు, కుక్కలు, పాడి జంతువులను పెంచుతున్నట్లయితే వాటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే చిలుకలు, పావురాలు, బాతులు పెంచుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వాటికి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల్లో కనిపించే లక్షణాలు
బర్డ్ ఫ్లూ సోకిన వారికి కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. గొంతు నొప్పి విపరీతంగా వస్తుంది. దగ్గు అధికంగా వస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. జ్వరం కూడా అధికంగా రావచ్చు. కళ్ళు నొప్పి పెట్టడం, తలనొప్పి రావడం వంటివి కనిపిస్తాయి. అలాగే కడుపు నొప్పి కూడా వస్తుంది. విరేచనాలు అవుతాయి. బలహీనంగా, అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముక్కు కారడం, కళ్ళు ఎర్రబడడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కోళ్ల ఫామ్‌లు వంటి వాటి దగ్గరికి వెళ్ళకండి. అలాగే చనిపోయిన పక్షులను ముట్టుకోవద్దు. మీ పెంపుడు జంతువులను తాకాలన్నా చేతికి గ్లవుజులను వేసుకోండి. చికెన్, గుడ్లు వంటివి తినాల్సి వస్తే బాగా ఉడికించిన తర్వాతే తినండి. చేతులు కడుక్కున్నాకే మీ ముఖాన్ని తాకండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం