



Best Web Hosting Provider In India 2024

Successful Women: కేవలం రూ.500 పెట్టుబడితో నెలకి మూడున్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్న మహిళ, ఈమె ఎందరికో ఆదర్శం
Successful Women: చిన్న వయసులోనే విధవరాలిగా మారిన ఆమె నిస్సహాయపడలేదు. ఆ తల్లి తనతో పాటు తన బిడ్డను కాపాడుకోవడం కోసం వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అది కూడా కేవలం 500 రూపాయల పెట్టుబడితో.
చిన్న వయసులోనే పెళ్లయింది. ఇరవై ఏళ్లు కూడా రాక ముందే కూతురు పుట్టింది. కూతురు పుట్టిన ఆనందం నాలుగు నెలలు కూడా మిగలలేదు. ఈలోపే భర్త ఒక ప్రమాదంలో మరణించాడు. 10వ తరగతి మాత్రమే చదివిన ఆ అమ్మాయి భవిష్యత్తు చీకటిగా మారిపోయింది. ఆమె అత్తమామలు ఎటువంటి ఆదాయం లేని వేరు. అయినా కూడా ఆమె అధైర్య పడకుండా తన కూతురు కోసం నిలిచి గెలిచింది. ఆమె పేరు కనికా తాలూక్దార్. ఇలాంటి పరిస్థితుల నుంచి కనికా ఇప్పుడు నెలకు మూడున్నర లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకుంది.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాలు
ఒకప్పుడు తినేందుకు తిండి లేని పరిస్థితుల్లో ఉన్న కనికా ఇప్పుడు ఎనిమిది మందికి ఉద్యోగం కల్పించింది. ధైర్యంగా నిలుచుంటే ఒంటరి మహిళ ఏదైనా సాధించగలదని నిరూపించింది కనికా. ఆమె వర్మీ కంపోస్టును తయారు చేస్తూ భారతదేశమంతటా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆమె ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్ కార్ట లో కూడా అందుబాటులో ఉన్నాయి. అలా అని ఆమె చదువుకున్నది కూడా లేదు. ఆమెకి ఇంగ్లీష్ కూడా రాదు. అయినా జీవిత పోరాటంలో గెలిచింది.
కనికాది అసోంలోని నల్బరీ జిల్లా బోర్జర్ గ్రామం. భర్త చనిపోయిన తర్వాత ఆమెను పోషించే స్థితిలో అత్తమామలు లేకపోవడంతో కనిక తండ్రి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర కూడా తినడానికి సరైన పరిస్థితులు లేవు. భర్త పోయిన బాధ నుంచి కోలుకోవడానికి ఎంతో సమయం పట్టింది. తండ్రి కూడా వృద్ధుడు అయిపోవడంతో అతని బాధ్యత కూడా కనికా మీదే పడింది. ఆమె కొన్ని రోజులు పొలంలో పనిచేసింది. మేకలను పెంచింది. కానీ ఆ ఆదాయం తనకు, తన తండ్రిని పోషించేందుకు, కూతురిని చదివించేందుకు ఏమాత్రం సరిపోలేదు.
2014లో ఆమె వర్మీ కంపోస్ట్ పై శిక్షణ కార్యక్రమం తీసుకోండి. వర్మీ కంపోస్టు ఉపయోగాలు ముందుగా అర్థం చేసుకుంది. వానపాములు, సేంద్రీయ వ్యర్ధాలు, నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలతో ఎరువును తయారు చేస్తే మొక్కలు ఎంత ఆరోగ్యంగా పెరుగుతాయో ఆమెకు అర్థమైంది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే వాటిని తయారు చేయవచ్చని అర్థం చేసుకొని ఆ పనిలో పడింది.
అయిదు వందల రూపాయలతో బిజినెస్
ఆమె దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 500 రూపాయలతోనే వర్మీ కంపోస్టు తయారీని మొదలుపెట్టింది. నిజానికి వర్మీ కంపోస్టుతో పాటు తేనెటీగల పెంపకం, పూల పెంపకం, చేపల పెంపకం, పాడి పెంపకం పై కూడా శిక్షణా తరగతులు ఉన్నాయి. కానీ కనికా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో వాటన్నింటిలోని అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే వర్మీ కంపోస్ట్ తయారీనే ఎంచుకుంది.
అన్నీ ఏరితెచ్చుకుని
వర్మీ కంపోస్ట్ తయారీకి కావాల్సినవన్నీ తన చేతితోనే ఏరితెచ్చి ఒక దగ్గర పెట్టుకునేది. వర్మి కంపోస్టు ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఆమెకు వర్మీ కంపోస్టు తయారీ మరింత సులువుగా మారింది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి పెద్ద పెద్ద డబ్బాలు, సిమెంటు గుంతలు అవసరం పడతాయి. వాటికి ఖర్చు పెట్టే శక్తి లేక ఇంటి చుట్టుపక్కల ఉన్న వెదురు బొంగులు తెచ్చి వాటితోనే బుట్టలు పెద్దగా అల్లి వాటిలోనే కంపోస్ట్ ను తయారు చేయడం మొదలుపెట్టింది.
వర్మీ కంపోస్టు తయారీ ఇలా
తన ఇంట్లోనే ఆవు పేడ, గొర్రెలు పేడ, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్ధాలు, మొక్కల అవశేషాలు ఇలా అన్నింటినీ ఏరి తెచ్చి అందులో వేసేది. ఊళ్లో ఎక్కడ చెత్త దొరికినా తీసుకొచ్చి మరి మీ కంపోస్టులో కలిపేది. అలాగే వానపాములను కొని తెచ్చి అందులో వేసేది. అలా మంచి వానపాము జాతులను ఎంపిక చేసుకొచ్చి వేసింది. వర్మీ కంపోస్ట్ చక్కగా తయారైంది.
మొదటిసారి ఒక కిలో నుంచి 5 కిలోల వరకు సేంద్రియ ఎరువు ప్యాకెట్లను తయారు చేసి మార్కెట్లో అమ్మింది. మొదటిసారి ఆమెకి ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి. అదే ఆమె తొలి విజయం. ఆ డబ్బుతో కనికాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉత్పత్తిని మరింతగా పెంచింది. ఆ ఎనిమిది వేలను మళ్ళీ పెట్టుబడిగా ఉపయోగించి తిరిగి ఎక్కువ మొత్తంలో వర్మి కంపోస్ట్ ను తయారు చేయడం ప్రారంభించింది. కేవలం ఏడాదిలోనే ఆమె 100 క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్‌ను ఉత్పత్తి చేసింది. దీంతో ఆమెకు వచ్చే ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే ఆమె దగ్గర నేర్చుకోవడానికి కూడా ఎంతోమంది ఆసక్తి చూపించారు.
ఇప్పుడు ఏకంగా వర్మీ కంపోస్టు తయారీ కోసం అరెకరం భూమిని అద్బెకు తీసుకుని నెలకి 35 వేల నుండి 40 వేల కిలోల వర్మీ కంపోస్టును తయారు చేస్తోంది. ఒక్కో కిలో పది రూపాయల నుండి 12 రూపాయలు చొప్పున అమ్ముతోంది. అంటే నెలవారీ ఆమె ఆదాయం మూడున్నర లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఉంది. ఇప్పుడు ఆమె కూతురు మంచి స్కూల్లో చదువుతోంది. అంతేకాదు ఎన్నో వ్యవసాయ యూనివర్సిటీ వారు వచ్చి మరి ఈమెతో మాట్లాడి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.
కనిక వర్మి కంపోస్టు ఉత్పత్తులను అధికంగా అసోం, నాగాలాండ్, అరుణాచల్, మేఘాలయ నుండి రైతులు ఎక్కువగా వీటిని కొంటున్నారు. ఈమె తన వర్మి కంపోస్ట్ ఉత్పత్తులను జే వర్మి కంపోస్ట్ బ్రాండ్ నేమ్ మీద అమ్ముతోంది. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నుండి ఈమె లక్షల సంపాదించే స్థాయికి కేవలం ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం