



Best Web Hosting Provider In India 2024

Bhupalapalli Murder: మేడిగడ్డ కుంగుబాటుపై పిటిషన్ వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూపలపల్లి జిల్లాలో ఘోరం
Bhupalapalli Murder: భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య జరిగింది. మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయస్థానంలో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యపై మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.
Bhupalapalli Murder: భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడిగడ్డ కుంగుబాటుపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని అగంతకులు దారుణంగా హత్య చేశారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు. మృతుడిపై గతంలో భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
2023లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగి పోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేశారు. ఈ కేసులో కేసీఆర్, హరీష్‌రావులకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) భూ వివాదాల్లో జోక్యం చేసుకునే వారు. ఈ క్రమంలో దారుణ హత్యకు గురయ్యారు.
బుధ వారం రాత్రి ఏడున్నర గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ను నరికి చంపారు. హత్య ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. హత్యకు గురైన రాజలింగ మూర్తి భార్య గతంలో బీఆర్‌ఎస్ తరపున వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు.
2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచారు. కొద్ది నెలలకే కౌన్సిలర్‌నాగవెళ్లి సరళను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. బుధవారం రాత్రి మృతుడు రాజలింగ మూర్తి స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతుండగా దుండగులు దాడి చేశారు.
నలుగురైదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయాలతో పాటు కత్తిపోట్లతో పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపు లింగమూర్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడు రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ద్వారా భూ వివాదాలను పరిష్కరించే వారు. ఈ క్రమంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బ తింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కూడా ఫిర్యాదు చేశారు.
మరోవైపు తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబులు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి భూపాలపల్లిలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
టాపిక్