



Best Web Hosting Provider In India 2024

AP School Education : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు విడుదల
AP School Education : రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించింది. ఈనెల 25వ తేదీలోపు విజ్ఞాన యాత్రలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
విజ్ఞాన యాత్రలతో విద్యార్థులు లోకజ్ఞానం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతోందని.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఇదొక మంచి అనుభూతిని ఇస్తోందని అధికారులు స్పష్టం చేశారు. యాత్రల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో విజ్ఞానదాయక ప్రదేశాల సందర్శనకు ఒక్కో విద్యార్థికి రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది.
ఒక్కో విద్యార్థికి రూ.200
రాష్ట్రం పరిధిలోని విజ్ఞాన యాత్రలకు ఒక్కో విద్యార్థికి రూ.200 చొప్పున కేటాయిచింది. గతంలో కేవలం 8,9 తరగతుల విద్యార్థులకే విజ్ఞానయాత్రలు ఉండగా, ఇప్పుడు ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులు ఈ యాత్రలకు వెళ్లే అవకాశం కల్పించింది. ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి తప్పనిసరిగా ఉండాలనే స్పష్టం చేసింది.
ఎంపిక ఇలా..
విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లే విద్యార్థుల ఎంపికకు ప్రాధాన్యాలు కూడా సూచించింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ విజ్ఞాన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి 10 మంది విద్యార్థినులకు ఒక మహిళ ఉపాధ్యాయురాలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 40 నుంచి 50 మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సును ఎంపిక చేసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సూచించింది.
సైన్స్ పోటీల్లో విజేతలకు..
సైన్స్ ప్రతిభా పోటీల్లో ఎంపికైన విద్యార్థులతో పాటు.. సైన్స్ పాఠ్యాంశ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు విజ్ఞానయాత్రలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకు గైడ్‌గా వెళ్లే ఉపాధ్యాయులు సైతం సైన్స్ పోటీల్లో విజేతలను ఎంపిక చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయిలోనే విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
నిధుల కేటాయింపు ఇలా..
ఎంపికైన విద్యార్థులను వేరే రాష్ట్రాల్లోని విజ్ఞానదాయక ప్రదేశాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలకు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ విజ్ఞాన యాత్రలతో విద్యార్థులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. కొత్త ప్రాంతాలను సందర్శించినప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలుంటుందని టీచర్లు చెబుతున్నారు.
విద్యార్థులకు ఉపయోగం..
చదువుకున్న సమయంలోనే ఇలాంటి యాత్రల ద్వారా విద్యార్థులకు చాలా విషయాలు తెలుస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విజ్ఞాన యాత్రలకు నిధులు కేటాయించడం మంచి పరిణామని టీచర్లు చెబుతున్నారు. విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకే పరిమితం అయిన విద్యార్థులకు ఈ యాత్రలు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్