



Best Web Hosting Provider In India 2024

AP Fibernet Chairman: ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు…ఫైబర్‌నెట్ ఎండీపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం,రాజద్రోహం చేస్తున్నారని ఫైర్
AP Fibernet Chairman: ఏపీ ఫైబర్‌నెట్ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై సహకరించకపోవడంతో వ్యవహారం రచ్చకు ఎక్కింది. ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
AP Fibernet Chairman: ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం రచ్చకు ఎక్కింది. సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డికి ఎండీ ఐఏఎస్ అధికారి దినేశ్‌కు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. ఫైబర్‌నెట్ అధికారుల సహాయ నిరాకరణతో ఛైర్మన్ మీడియా ముందుకు వచ్చారు. ఫైబర్ నెట్ కార్యకలాపాలను ఎండీ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారంటూ ఛైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ఫైబర్ నెట్ కు 78 వేల కి.మీ. ఆప్టికల్ కేబుల్ ఉన్నా ఫైబర్ నెట్ కు ప్రతీ రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. నాణ్యతలేమితో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్‌నెట్ కనెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. తాజాగా ఎండీపై ఛైర్మన్ స్వయంగా అవినీతి ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఫైబర్‌నెట్ ఎండీగా ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గత ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నా ఒక్క రోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఎండీ కుమ్మక్కయ్యారనే సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి రాలేదని, ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదని ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని ఎండీ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఎందుకు ఉంచారు…
ఫైబర్‌నెట్‌లో ముగ్గురు అధికారులకు నోటీస్ పీరియడ్ ఇవ్వాలని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్యరామ భరద్వాజ, బిజినెస్ హెడ్ సురేష్, ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్ శశాంక్ హైదర్ ఖాన్ సేవలు ఫైబర్ నెట్ కు అవసరం లేకున్నా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వారిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.
గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి టెర్మినేట్ చేయలేదని వారికి జీతాలు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.
కష్టాల్లో ఏపీ ఫైబర్ నెట్…
ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ దినేష్ కుమార్, మరి కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థికమూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ అంశాలను అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా సంస్థలో పురోగతి లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయని సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగక పోవడం, కొత్త కనెక్షన్లు ఇవ్వక పోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎండీ దినేష్ కుమార్ వీటిపై సమీక్షించలేదని, సంస్థను ముందుకు వెళ్లనివ్వట్లేదని, ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలో భాగమనేనన్నారు. గత ప్రభుత్వంలో వారితో కలిసి ఫైబర్‌నెట్ సంస్థను చంపేయాలని ఎండీ చూస్తున్నారని ఆరోపించారు.
అకౌంట్స్ ఎందుకు చూపించడం లేదు..?
ఫైబర్ నెట్ అకౌంట్స్ చూపాలని చైర్మన్ హోదాలో అడిగినా అధికారుల్లో స్పందన లేదని జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ ఆడిట్ చేయించలేదని గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తెలుస్తాయనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ తీరుతో సంస్థ వార్షిక ఆదాయం రూ.2వేల కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గిందని ఈ ఏడాది ఇంకా ఎంతకు దిగజారుస్తారోనని ఆందోళనగా ఉందన్నారు.
ఎండీ నుంచి రికవరీ చేయాలి…
గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో ఉద్యోగాల్లో చేరిన 410 మందిని తొలగించాలని డిసెంబరులోనే నిర్ణయించినా వారు ఎక్కడ చేస్తున్నారో తెలియకుండానే రూ.1.50 కోట్ల జీతాలు చెల్లించారని అక్రమ నియామకాలను కొనసాగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ డబ్బును ఎండీ నుంచి రికవరీ చేయాలన్నారు.
జీఎస్టీ చెల్లింపుల వివాదంపై షోకాజ్ నోటీసు ఇస్తే.. ఫైబర్‌నెట్ తరపున వకాలత్ వేయక పన్ను, జరిమానాతో కలిసి రూ.377 కోట్లు చెల్లించాలని జీఎస్టీ కార్యాలయం జనవరి 23న నోటీసు ఇచ్చిందని ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలన్నారు. ఐటీ రిటర్న్ అక్టోబరు నాటికి ఫైల్ చేయాల్సి ఉన్నా పెనాలిటీతో ఆలస్యంగానైనా వేయించడంతో రూ.9 కోట్లు రిఫండ్ వచ్చిందన్నారు.
వ్యూహం సినిమా ప్రసారం విషయంలో ఒప్పందానికి విరుద్ధంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని రాంగోపాల్ వర్మకు నోటీసు ఇచ్చినా తదుపరి చర్యలు తీసుకోలేదని, పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు, ఫిర్యాదు తయారుచేసి పంపినా అధికారులు ఎందుకు సంతకం చేయట్లేదని నిలదీశారు.
ఏనుగులా ఉన్న ఫైబర్‌నెట్‌ను పీనుగగా చేశారని మండిపడ్డారు.ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్ కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి పేమెంట్లూ చేయవద్దని విజిలెన్స్ సూచించిన తర్వాత కూడా రూ.60 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టులో దినేశ్ కుమార్ ఫైబర్‌నెట్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ఒక్క కనెక్షన్ కూడా పెంచలేదని, పైగా ఉన్న కనెక్షన్లు కూడా పోయేలా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత కథనం
టాపిక్