



Best Web Hosting Provider In India 2024

Medak Dumping Yard: ప్యారానగర్ డంపింగ్ యార్డ్‌పై పునరాలోచించాలని సీపీఎం డిమాండ్, అణిచివేతలపై ఆగ్రహం
Medak Dumping Yard: ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోన్న డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయడం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరాలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు.
Medak Dumping Yard: ప్యారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేకే భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట బైటాయించి ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి గుమ్మడిదల, నల్లవల్లి, ప్యారానగర్ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ సందర్బంగా రాములు మాట్లాడుతూ ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నందున అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్ యార్డ్ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు.
గుమ్మడిదల ప్రాంతమంతా పచ్చటి పాడి పంటలతో కళకళలాడుతదని, నిత్యం కూరగాయలు, ఇతర పంటలు హైదరాబాద్‌కు సరఫరా అవుతాయన్నారు. ప్యారానగర్‌కు ఒక పక్క పచ్చటి అడవులు, మరో పక్క ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఉన్నాయనే విషయాల్ని సైతం అధికారులు విస్మరించి గుడ్డిగా చెత్త డంపింగ్ యార్డ్ పెట్టాలని నిర్ణయాలు తీసుకోవడం అనాలోచిత చర్య అన్నారు.
40 వేల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు..…
డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని 17 గ్రామాలకు చెందిన 40 వేల మంది ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజలంతా రోడ్లెక్కి వివిద రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సరైంది కాదన్నారు. డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితుల్ని గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన భాద్యత జిల్లా కలెక్టర్‌పై ఉన్నదన్నారు.
గుమ్మడిదల మండలమంతటా పోలీస్ బలగాల్ని మోహరించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత చైతన్యంతో తిరగబడతారని స్పష్టం చేశారు. తక్షణమే పోలీస్ పికెట్‌ను ఎత్తివేసి పోలీసుల్ని వెనక్కు రప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అడవులు, పంటలకు ముప్పు.…
పట్నంలో పోగయ్యే లక్షలాది మెట్రిక్ టన్నుల చెత్తను పోసేందుకు పచ్చటి అడవులు, పాడి పంటలు పండే పొలాలు, ప్రజలు జీవించే గ్రామాల మధ్య కాకుండా జనజీవనముండే ప్రాంతాల్లో కాకుండా దూరపు కొండల్లో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్యారానగర్-నల్లవల్లిలో డంపింగ్ యార్డ్ పెడితే ఆ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు.
ఇప్పటికే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్‌చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారన్నారు. డంపింగ్ యార్డ్ పెట్టి పచ్చగా ఉన్న గుమ్మడిదల ప్రాంతాన్ని చెత్తకుంపటి చేయొద్దని పేర్కొన్నారు.
16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా…
డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని ప్రజలు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. అందుకే కలెక్టరేట్ ఎదుట ధర్నా, ర్యాలీ చేశామన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమాన్ని ఇందిరాపార్క్ వరకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం, అధికారులు ఆలోచించి డంపింగ్ యార్డ్‌ను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆ పోరాటంలో సీపీఐ(ఎం) ముందు భాగాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, ఏజేసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ పెడితే గుమ్మడిదల మండలంలోని 17 గ్రామాలు పడావుపడిపోతాయని ఇవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు, నిర్బంధాలకు భయపడేది లేదని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శాంతియుత పద్దతుల్లో 16 రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, గ్రామాల్లోంచి ప్రజల్ని బయటికి రాకుండా పోలీస్‌లు నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.
సంబంధిత కథనం
టాపిక్