



Best Web Hosting Provider In India 2024

Tips For Hair Coloring: మొదటిసారి జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే జుట్టు దెబ్బతింటుంది!
Tips For Hair Coloring: మొదటి సారి జుట్టుకు రంగు వేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా జుట్టుకు రంగు వేయడం వల్ల వెంట్రుకలు దెబ్బతిని రాలిపోయే ప్రమాదం ఉంది. జుట్టుకు రంగు వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు కేవలం తెల్ల జుట్టును దాచుకోవడానికి మాత్రమే వెంట్రుకలకు నల్ల రంగును వేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. జుట్టుకు రంగు వేయడం ఇప్పుడు ట్రెండ్ అయింది. గ్రే హెయిర్‌ను దాచుకోవడానికి మాత్రమే కాకుండా కొత్త లుక్ కోసం, స్టైల్ గా కనిపించడం కోసం రకరకాల రంగులను వేసుకుంటున్నారు. చూడటానికి కాస్త ట్రెండీగా, స్టైల్‌గా అనిపించినప్పటికీ జుట్టుకు ఇలా రంగులు వేసుకోవడం ప్రమాదకరమనే చెప్పాలి.
ఎలాంటి అవసరం లేకుండానే తొందరపడి హెయిర్ కలర్ వేయించుకుంటే, ఆలోచించకుండా దీన్ని మీ అలవాటుగా మార్చుకుంటే ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ మీకు హెయిర్ కలర్ వేయించుకోవడం చాలా ఇష్టమైతే జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు, చర్మంపై రంగు మచ్చలు పడకుండా ఉండేందుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
జుట్టు ఆరోగ్యాన్ని బట్టి రంగును ఎంచుకోండి..
హెయిర్ కలర్ వేయించుకునే ముందు మీరు మొదట చేయాల్సిన పని మీ జుట్టు ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం. జుట్టు చాలా పొడిగా లేదా దెబ్బతిని ఉంటే మీరు మొదట చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి జుట్టుకు రంగు వేయడం వల్ల వెంట్రుకలకు రంగు బాగా పట్టదు, పైగా జుట్టు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి మీరు ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ సహాయం తీసుకోవచ్చు. వారు మీ జుట్టు పరిస్థితి, టెక్స్చర్ ను చూసి మీకు ఉత్తమ రంగు, పద్ధతిని సూచిస్తారు.
సరైన రంగు షేడ్‌ను ఎంచుకోండి
ట్రెండ్ లేదా ఇతరులను కాపీ చేసే ఉద్దేశ్యంతో ఏ రంగు పడితే ఈ రంగు జుట్టుకు వేసుకోకండి. ఇది మీ లుక్‌తో పాటు వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. హెయిర్ కలర్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కనుక కలర్ షేడ్‌ను తెలివిగా ఎంచుకోండి. మీ వ్యక్తిత్వానికి, జుట్టుకు సరిపోయే హెయిర్ కలర్ మాత్రమే ఎంచుకోండి.
ధర విషయంలో రాజీ పడకండి
హెయిర్ లేదా స్కిన్ వంటి బ్యూటీ ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు ధర విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి. నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఇవి మీ పూర్తి లుక్‌ను మార్చేస్తాయి. నలుగురిలోనూ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల హెయిర్ కలర్ ను మాత్రమే మీ జుట్టుకు వేయండి. లేదంటే జుట్టు చాలా దెబ్బతిని రాలిపోవచ్చు. అంతేకాకుండా హెయిర్ కలర్‌ను వాడే ముందు దాని గడువు తేదీని తప్పకుండా చూడండి.
చర్మాన్ని రక్షణ గురించి మర్చిపోకండి
హెయిర్ డై ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉన్న జుట్టుకు వేయండి. హెయిర్ కలర్ వేసే ముందు హెయిర్ లైన్, చెవి, మెడ చుట్టూ వాజెలిన్ లేదా ఏదైనా మందపాటి క్రీం వేసుకోండి. ఇలా చేయడం వల్ల హెయిర్ కలర్ చర్మానికి పట్టకుండా ఉంటుంది. అలాగే కలర్ వేసేటప్పుడు మీ చేతులను రక్షించుకోవడానికి గ్లోవ్స్ ధరించండి.
తలకు హెయిర్ కలర్ వేయకండి
జుట్టుకు రంగు వేసేటప్పుడు వెంట్రుకలతో పాటు తలకు వేయడం మానుకోండి. నిజానికి మార్కెట్లో లభించే హెయిర్ డై ఉత్పత్తులు కెమికల్స్ తో కూడి ఉంటాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లకు హాని చేయచ్చు. వీటిని మీ తలకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య రావచ్చు. అలాగే దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు కూడా రావచ్చు. తలకు పట్టకుండా వెంట్రుకలకు మాత్రమే రంగు పట్టేలా జాగ్రత్తగా రంగు వేసుకోండి.
సంబంధిత కథనం