



Best Web Hosting Provider In India 2024

Jaggery adulteration: మీరు కొన్న బెల్లం మంచిదో కల్తీదో తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు ఇవిగో
Jaggery adulteration: బెల్లం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు కల్తీ బెల్లం మార్కెట్లోకి అధికంగా వస్తోంది. బెల్లం మంచి రంగులో కనిపించడానికి కృత్రిమ రంగులను కలుపుతున్నారు. బెల్లం శుద్ధతను పరీక్షించడం చాలా ముఖ్యం. బెల్లం మంచిదో కల్తీదో ఇలా తెలుసుకోండి.
బెల్లం వాడకం తెలుగిళ్లల్లో అధికంగానే ఉంటుంది. దీన్ని చెరకు లేదా తాటి రసాలతో తయారుచేస్తారు. ఇది సహజ తీపి పదార్థం. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. బెల్లం శుధ్దంగా ఉంటేనే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఇప్పుడు కల్తీ బెల్లం మార్కెట్లోకి వస్తోంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
బెల్లంలో రసాయనాలు లేదా కృత్రిమ రంగుల మిశ్రమాన్ని కలిపి అమ్ముతున్నారు. కాబట్టి, బెల్లం శుద్ధతను పరీక్షించడం చాలా ముఖ్యం. ఈ పనిని చాలా సులభమైన కొన్ని పద్ధతుల ద్వారా ఇంట్లోనే చేయవచ్చు. బెల్లం శుద్ధతను ఎలా పరీక్షించాలో ఇక్కడ తెలుసుకోండి.
బెల్లం ప్యురిటీని పరీక్షించే విధానాలు ఇవిగో
కృత్రిమ రంగు పరీక్ష: బెల్లం రంగును గమనించండి. సహజంగా శుద్ధమైన బెల్లం గోధుమ లేదా బంగారు పసుపు రంగులో ఉంటుంది. బెల్లం మెరుస్తూ ఉంటే దానిలో కృత్రిమ రంగు మిశ్రమం ఉందని అర్థం చేసుకోండి. దీన్ని పరీక్షించడానికి, బెల్లం ముక్కను నీటిలో కరిగించండి. నీరు మరీ ముదురు రంగును పొందితే అది కల్తీదని అర్థం.
మిశ్రమాల పరీక్ష: కొన్నిసార్లు బరువు పెంచడానికి బెల్లంలో బొగ్గు పొడి, సున్నం లేదా ఇతర అనవసరమైన పదార్థాలను కలుపుతారు. దీన్ని పరీక్షించడానికి, బెల్లం ముక్కను నీటిలో వేయండి. శుద్ధ బెల్లం పూర్తిగా కరుగుతుంది. కానీ, కల్తీ బెల్లం నీటిలో మురికి లేదా పొడి వంటి పదార్థాన్ని వదిలివేస్తుంది.
డిజైన్ పరీక్ష: బెల్లం డిజైన్, ఆకారం ద్వారా కూడా అది మంచిదో కాదో తెలుసుకోవచ్చు. బెల్లం ముక్కను చేతితో విరగగొట్టండి. అది సులభంగా విరిగిపోవాలి. కొంత చేతికి అంటుకునే గుణాన్ని కలిగి ఉండాలి. కానీ, అది చాలా గట్టిగా ఉంటే లేదా విరగడానికి కష్టంగా ఉంటే, దానిలో అనవసరమైన మిశ్రమాలను కలిపారు అని అర్థం.
సల్ఫర్ సమ్మేళనాల పరీక్ష: కొన్నిసార్లు బెల్లానికి సల్ఫర్ సమ్మేళనాలను జత చేస్తారు. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఇలా కలుపుతారు. దీన్ని పరీక్షించడానికి, బెల్లం ముక్కను నీటిలో కరిగించి, దానికి కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. దాని నుండి నురుగు లేదా బుడగలు వస్తే సల్ఫర్ ఉపయోగించారని అర్థం చేసుకోవచ్చు.
రుచి, వాసన పరీక్ష: బెల్లం సహజమైన రుచి, వాసన శుద్ధతకు సంకేతం. ఒక ముక్క బెల్లం తీసుకొని రుచి చూడండి. శుద్ధ బెల్లం తీపి, మట్టి వాసన, కొద్దిగా కారమెల్ వంటి వాసనను కలిగి ఉంటుంది. కానీ, కల్తీ బెల్లం అధికంగా తీపిగా ఉండవచ్చు. దాన్ని తిన్నప్పుడు అసహజమైన రుచి లేదా అధికంగా తీపిగా ఉంటే అది కల్తీ బెల్లం కావచ్చు.
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మంచి నాణ్యత గల బెల్లం మాత్రమే ఉపయోగించడానికి, ఈ సులభమైన పరీక్షలను చేయండి. ఇది మార్కెట్ నుండి కొనుగోలు చేసేటప్పుడు మంచి నాణ్యత గల బెల్లం ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్