


Best Web Hosting Provider In India 2024
Elamanchili railway station : పాత రైళ్లు రావు.. కొత్త రైళ్లు ఆగవు.. ఎలమంచిలి ప్రజలు ఏం పాపం చేశారు?
Elamanchili railway station : ఎలమంచిలి ఏరియాలో చిరు వ్యాపారులు ఎక్కువ. వారు ఎలమంచిలి నుంచి వివిధ పట్టణాలకు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఎక్కువ ట్రైన్లపైనే ఆధారపడతారు. కానీ రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలమంచిలి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం.. రోజూ వేలాది మంది విశాఖపట్నం, రాజమండ్రి, తునికి వెళ్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం రైళ్ల పైనే ఆధారపడతారు. అయితే.. ఇటీవల రైల్వే శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైళ్లను రద్దు చేయడం పెద్ద సమస్యగా మారింది. అటు కొత్త ట్రైన్లకు ఎలమంచిలిలో హాల్టింగ్ లేదు. దీంతో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా భారం పెరుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
పోరాటం చేస్తున్నా..
ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు నెలవారి పాసులు తీసుకొని తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేని కారణంగా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని చెబుతున్నారు. కొత్త రైళ్ల హాల్టింగ్‌కు సంబంధించి ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అటు ప్రజా ప్రతినిధులు కూడా రైళ్ల హాల్టింగ్ కోసం ప్రయత్నాలు చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు..
ఎలమంచిలిలో ఏపీ ఎక్స్‌ప్రెస్, గరీబ్‌రథ్, రత్నాచల్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పట్టించునే వారు లేదు. ఎలమంచిలి స్టేషన్ నుంచి రోజూ 2 నుంచి 3 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే.. ఇటీవల అధికారులు వివిధ కారణాలతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, రాయగడ, కాకినాడ, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వచ్చేనెల వరకు నిలిపివేశారు. రోజుల తరబడి రైళ్లను రద్దు చేయడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదాయం అంతంతే.. ఖర్చు ఎక్కువ..
ఇక్కడి ప్రజలు ఎక్కువగా విశాఖపట్నం వెళ్తుంటారు. రైలులో ప్రయాణిచడానికి రూ. 270 చెల్లించి నెలవారి పాస్ తీసుకుంటారు. అదే బస్సుల్లో ప్రయాణిస్తే.. నెలకు రూ.7 వేలకు పైనే ఖర్చు అవుతోంది. వచ్చే ఆదాయంలో ప్రయాణానికే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని.. ఫలితంగా ఆర్థిక భారం పెరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. బస్సుల్లో అయితే ప్రయాణ సమయం కూడా ఎక్కువ అని చెబుతున్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించి.. కొత్త రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
టాపిక్