


Best Web Hosting Provider In India 2024
GV Reddy Resign : ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా.. తెలుగుదేశం పార్టీ కూడా.. కారణం ఇదే!
GV Reddy Resign : ఏపీ ఫైబర్‌నెట్‌లో ఇటీవల ఓ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సంస్థ ఎండీ దినేష్‌కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ.. ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు. తాజాగా జీవీ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు.
ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికీ జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవీ రెడ్డి వెల్లడించారు.
ఏం జరిగింది..
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌లో ఇటీవల వివాదం జరిగింది. సంస్థ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ.. ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో సీఎంవో సూచన మేరకు.. ఇటీవల జీవీ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఫైబర్‌నెట్‌లో జరిగిన వ్యవహారాలపై వివరణ ఇచ్చారు.
చంద్రబాబు వార్నింగ్..
అయితే.. జీవీ రెడ్డి సీఎంను కలవకముందు.. ఈ విషయంపై చంద్రబాబు అధికారుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రిని కలసి తన దగ్గరకు రావాలని.. బహిరంగ ఆరోపణలకు దిగడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది మంచి పరిణామం కాదని చంద్రబాబు మందలించినట్టు తెలిసింది. ‘నేను ఎంతో కష్టపడి వ్యవస్థను నిర్మించాను. ఐఏఎస్ అధికారులపై ఇలా బహిరంగంగా మాట్లాడితే.. మిగిలిన వాళ్లూ అదే పంథాను అనుసరిస్తే పరిస్థితి ఏంటి? అధికారులకు నేను సమాధానం చెప్పుకోవాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది.
రెండ్రోజులకే..
‘మీకున్న తెలివితేటలను సంస్థ అభివృద్ధి కోసం వినియోగించాలి. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంత్రికి నేను సూచన ఇస్తాను. సంస్థ ఎండీ, మీరు కూర్చుని సమస్యను సర్దుబాటు చేసుకోండి’ అని జీవీ రెడ్డికి సీఎం చంద్రబాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన రెండ్రోజులకే జీవీ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
మూడు నెలల కిందట..
గతేడాది నవంబర్ 16వ తేదీన ఫైబర్‌నెట్ ఛైర్మన్‌గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ కనెక్షన్లను.. వచ్చే రెండేళ్లలో 50 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని.. ఇంటర్‌నెట్, కేబుల్ ప్రసారాలను మంచి నాణ్యతతో అందిస్తామని చెప్పారు. కానీ.. మూడు నెలలకు ఆయన రాజీమానా చేయడం చర్చనీయాంశంగా మారింది.
టాపిక్