Best Web Hosting Provider In India 2024

ఆ నిధులు ప్రాజెక్టు పనులకు అస్సలు సరిపోవు
వెంటనే ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలి
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియా సమావేశం
ప్రాజెక్టు పునరావాస పనులకే రూ.1000 కోట్లు కావాలి
కానీ కేవలం రూ.116 కోట్ల కేటాయింపు దారుణం
రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు?
ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి: ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు చాలా తక్కువ నిధులు కేటాయించి, అన్యాయం చేస్తున్నారని యర్రగొండపాలం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. ప్రాజెక్టు పనులకు కేవలం రూ.359 కోట్లు కేటాయించారన్న ఆయన, ఈ నిధులు ఆ పనులకు ఏ మాత్రం సరిపోవని చెప్పారు. ఇంకా ఆర్ అండ్ ఆర్ (రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) ప్యాకేజీ కింద రూ.1000 కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.116 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా వెంటనే తగిన నిధులు కేటాయించాలన్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే, అసలు రైతులంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు అని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:
ఆ ఎమ్మెల్యేల మౌనం దుర్మార్గం:
పశ్చిమ ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్‌సీపీ బలంగా ఉండడంతో, ఆ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబుకు కొంత కూడా చిత్తశుద్ధి లేదు. ప్రకా«శం జిల్లాలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఈ విధంగా నిర్వీర్యం చేస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలు కనీసం నోరెత్తక పోవడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా, ఈ ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి తాగునీరు అందించే మహత్తరమైన వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులో ముఖ్యమైన రెండు టన్నెల్స్ పనులు దాదాపు పూర్తయ్యా. కొద్దిపాటి ఫినిషింగ్ పనులు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇకనైనా మొద్దు నిద్ర వీడాలి:
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోని సీఎం చంద్రబాబు, మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా మారుస్తామంటూ కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. కూటమి నేతలు ఇకనైనా మొద్దు నిద్ర వీడాలని, వెలిగొండ ప్రాజెక్టు పనుల పూర్తికి తగిన నిధుల కేటాయించేలా సీఎంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు.