




Best Web Hosting Provider In India 2024

CM Chandrababu : నిన్న హోంమంత్రికి కానిస్టేబుల్ ప్రశ్న-నేడు మహిళా ఉద్యోగులందరికీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
CM Chandrababu : ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతమంది పిల్లలను కన్నా అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని సీఎం సూచించారు. ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు ఇస్తారా? అని ఓ కానిస్టేబుల్ హోంమంత్రిని ప్రశ్నించారు.

CM Chandrababu : ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం నారా చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని, ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్తున్నానని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కలిగి ఉంటారన్నారు. దక్షిణ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేవన్నారు. ఇక్కడి ప్రజలు తక్కువన మంది సంతానాన్ని కలిగి ఉంటారన్నారు. కొందమంది ఏకంగా పిల్లలను కనడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు.
పిల్లలను కనకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇద్దరు పిల్లలకు ప్రసూతి సెలవులు ఇస్తుండగా ఇకపై ఎంతమందిని పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటితో పాటుగా ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.
అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు
సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తారు. ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తారు. అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచిస్తున్న సీఎం…అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని వెల్లడించారు. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగులకు ఈ తీపికబురు చెప్పారు.
రానున్న రోజుల్లో దేశం వృద్దాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండేందుకు కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పిల్లల్ని కనకపోవడం, మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించామన్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశామని గుర్తుచేశారు.
హోంమంత్రికి కానిస్టేబుల్ ప్రశ్న
“ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమందిని కనమంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవు ఇస్తున్నారు. మూడో బిడ్డను కనేవారికీ ప్రసూతి సెలవులను ఇస్తారా?” అంటూ హోంమంత్రి వంగలపూడి అనితను శ్రుతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ పోలీసుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులను వారి సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగమంటూ అవకాశమిచ్చారు. దీంతో శ్రుతి హోంమంత్రిని ఈ ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న అడిగావంటూ సదరు కానిస్టేబుల్‌ను మంత్రి మెచ్చుకుని విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళ్తానని హామీనిచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్